ఇప్పటం హీట్‌.. పవన్‌ పర్యటన ఉద్రిక్తం!

Update: 2022-11-05 05:31 GMT
జనసేన ఆవిర్భావ సభకు తమ స్థలాలు ఇచ్చారని ఇప్పటంలో కాపు సామాజికవర్గానికి చెందిన 76 ఇళ్లను జగన్‌ ప్రభుత్వం కూల్చిందని విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిని పరామర్శించడానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. శనివారం ఉదయం భారీగా మంగళగిరిలోని జనసేన పార్టీకి చేరుకున్న పోలీసులు నలువైపులా కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఆయనను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా ఇప్పటం వెళ్లడానికి అనుమతి లేదని అడ్డుకున్నారు.

తన వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో పవన్‌ మూడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూనే ముందుకు వెళ్లారు. దమ్ముంటే పోలీసులు తనను అరెస్టు చేయాలని సవాల్‌ విసిరారు. భారీగా ప్రజలు తరలిరావడంతో వారిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. ఆ తర్వాత పవన్‌ వాహనం రావడంతో అందులో ఎక్కారు. ఓపెన్‌ టాప్‌ జీపులో ఎక్కి తన కోసం వచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేస్తూ ముందుకుసాగారు.

ఇప్పటం చేరుకున్న పవన్‌ చిన్న పిల్లలను ఎత్తుకుని ప్రజలను పరామర్శించారు. ఇల్లు కోల్పోయినవారు ఆయనను చూసి కంటతడి పెట్టారు. ఏమీ భయపడవద్దని మీకు తాను అండగా ఉంటానని పవన్‌ భరోసా ఇచ్చారు. రోడ్లు వేయలేని దద్దమ్మ ప్రభుత్వం రోడ్ల విస్తరణ చేస్తోందని ఎద్దేవా చేశారు. రోడ్ల విస్తరణ చేయడానికి ఇదేమైనా రాజమండ్రా, కాకికాడా అని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక ఇడుపులపాయ మీదుగా హైవే వేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Read more!

ఏప్రిల్‌లో జరిగిన తమ పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే ఇప్పటం ప్రజల ఇళ్లను కూల్చారని పవన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలు చేసేవారిని వదిలేసి పోలీసులు తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తనకు మాట్లాడే హక్కు లేదా అని నిలదీశారు.

పెదకాకానిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటి ముందు 15 అడుగుల రోడ్డే ఉందని మరి దాన్ని ఎందుకు విస్తరించని పవన్‌ ప్రశ్నించారు. వైసీపీ గూండాగాళ్లు అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

మరోవైపు పవన్‌ కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో ఇప్పటం గ్రామంలో ఉన్న రెండు వైఎస్సార్‌ విగ్రహాల చుట్టూ పోలీసులు ముళ్ల కంచెలు వేశారు. వాటిని ధ్వంసం చేస్తారని భావించిన పోలీసులు ఆ విగ్రహాలకు నలువైపులా భారీ స్థాయిలో బందోబస్తు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Tags:    

Similar News