తమిళనాడులో రాజకీయ తుఫాన్ సద్దుమణిగింది

Update: 2020-10-08 11:12 GMT
వచ్చే ఏడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తర దృశ్యం చూడబోతున్నాం. ఎన్నో దశాబ్దాల తర్వాత రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలిత లేకుండా జరగనున్న ఎన్నికలు ఇవి. గత ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఏడాదిలోపే జయ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయానికే అనారోగ్యంతో మంచంపాలైన కరుణానిధి కూడా తర్వాత కాలం చేశారు. వీళ్లు వెళ్లిపోగానే తమిళనాడు రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే ఉన్నట్లుండి బలహీనపడిపోయింది. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరిగి అనూహ్య పరిణామాల మధ్య ఎడప్పాడి పళని స్వామి సీఎం అయిన సంగతి తెలిసిందే. జయ వారసుడిని తనే అనుకున్న పన్నీర్ సెల్వం అనూహ్యంగా పక్కకు వెళ్లిపోయారు. కానీ పార్టీలో ఆయనేమీ బలహీనపడిపోలేదు. ఏ చిన్న అవకాశం వచ్చిన పళనిస్వామి స్థానంలోకి రావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

ఇంతలో మళ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పన్నీర్ సెల్వం తెరపైకి వచ్చారు. సీఎం అభ్యర్థి కావాలని ఆశపడ్డారు. ఆ దిశగా పావులు కదిపారు. ఆగస్టు 15న కాబోయే ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అంటూ ఆయన అభిమానులు ముద్రించిన పోస్టర్‌ కారణంగా పార్టీలో కలకలం రేగింది. సెప్టెం బరు 28న అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో సీఎం అభ్యర్థిగా తామే అర్హులమంటూ పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వాదులాడుకోవడంతో అన్నాడీఎంకేలో సంక్షోభం నెలకొంది. అసలే పార్టీ బలహీనంగా ఉంటే.. ఎన్నికల ముంగిట సీఎం అభ్యర్థిత్వం కొట్టుకుంటే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఈ వ్యవహరాన్ని చక్కదిద్దే పనిలో పడ్డారు. వారి మంత్రాంగం ఫలించి పన్నీర్ సెల్వం లైన్లోకి వచ్చారు. బుధవారం వేలాదిమంది పార్టీ కార్యకర్తల సందడి నడుమ పళనిస్వామి, పన్నీర్‌సెల్వం, మంత్రులు సమావేశమయ్యారు. పన్నీర్‌సెల్వం ఇంతకుముందు కోరినట్లుగా పార్టీ లో 11 మందితో మార్గదర్శక కమిటీ ఏర్పాటు చేస్తున్నటు పళని స్వామి ప్రకటించారు. ఆ తర్వాత వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు స్వయంగా పన్నీర్‌సెల్వమే ప్రకటించారు. దీంతో అన్నాడీంకేలో చెలరేగిన అంతర్గత సంక్షోభానికి తెరపడినట్లయింది.
Tags:    

Similar News