మాకు ఇండియానే ముఖ్యం .. ఇమ్రాన్ ఖాన్‌కు శ్రీలంక ఊహించని షాక్

Update: 2021-02-22 23:30 GMT
పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ కు శ్రీలంక ప్రభుత్వం షాకిచ్చింది. ఆ దేశ పర్యటనలో పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించాల్సి ఉండగా.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఇందుకు జమ్మూకాశ్మీర్ అంశమే కారణం కావడం గమనార్హం. భారత్ ‌తో ఎలాంటి వివాదం తలెత్తవద్దన్న ఉద్ధేశ్యంతోనే శ్రీలంక ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు కొలంబో గెజిట్ ప‌త్రిక త‌న క‌థ‌నంలో ప్రచురించింది. కాగా భారత్‌ శ్రీలంకకు కరోనా వ్యాక్సిన్‌ లను అందిస్తోంది. ఇప్పటికే 5 లక్షల కోవిషిల్డ్‌ డోసులను ఆ దేశానికి పంపించింది. ఇలాంటి సమయంలో భారత్‌ తో తమకున్న దౌత్య సంబంధాన్ని పణంగా పెట్టేందుకు శ్రీలంక సిద్ధంగా  లేనట్లు తెలుస్తోంది.

అంతేగాక శ్రీలంకలో ముస్లింల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు కూడా జ‌రుగుతున్నాయి.  మసీదులలో జంతువులను బలిస్తున్నారని అక్కడి బౌద్దులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఇమ్రాన్‌ ఒక‌వేళ శ్రీలంక పార్ల‌మెంట్‌లో మాట్లాడితే అప్పుడు భార‌త్‌ తో పాటు స్థానిక బౌద్దులకు కూడా స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భావించి ప్రధాని ప్రసంగాన్ని రద్దు చేసింది.

కాగా ఇమ్రాన్ ఖాన్‌ అంతర్జాతీయ వేదికలపై జమ్మూకశ్మీర్‌పై అవాస్తవాలు ప్రచారం చేయడం అలవాటుగా మారిన విషయం తెలిసిందే. 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ భారత్ పై  తన అక్కసును వెళ్లగక్కుతోంది. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఇక్కడ కూడా ఆ అంశంపై మాట్లాడతారనే అనుమానంతో ఆయన ప్రసంగాన్ని శ్రీలంక ప్రభుత్వం రద్దు చేసింది.

2015లో భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక పార్లమెంటులో ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే, అంతటి ప్రాధాన్యతను పాక్ ప్రధానికి ఇవ్వాల్సిన అవసరం లేదని శ్రీలంక భావించినట్లు తెలుస్తోంది. ఆ దేశ మీడియాలో ఈ మేరకు వార్తలు కూడా రావడం గమనార్హం. కాగా, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పర్యటన షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి 22 నుంచి రెండ్రోజులపాటు ఇమ్రాన్.. శ్రీలంకలో పర్యటించనున్నారు. పార్లమెంటులో ప్రసంగం మినహా అన్ని కార్యక్రమాలు సాగుతాయని వెల్లడించాయి. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత దేశాన్ని సందర్శించిన తొలి దేశాధినేత ఖాన్ అవుతారని, పర్యటన సందర్భంగా అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, ప్రధాని మహీంద రాజపక్సే, విదేశాంగ మంత్రి దినేష్ గుణవర్ధనలతో చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Tags:    

Similar News