భార‌త్‌ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతోంద‌ట‌!

Update: 2017-08-02 04:04 GMT
న‌రేంద్ర మోదీ భార‌త ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించి అప్పుడే మూడేళ్లు దాటిపోయింది. నాలుగో ఏడాది పాల‌న కూడా మొద‌లైపోయింది. అయితే మోదీ ప్ర‌ధాని అయ్యాక మ‌న జీవ‌న ప్రమాణాలు ఏమైనా మెరుగుప‌డ్డాయా? అన్న ప్ర‌శ్న‌కు ఎన్డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాలు ఔన‌ని, యూపీఏలోని పార్టీలు కాద‌ని స‌మాధానం చెబుతాయి. మ‌రి స‌గ‌టు జీవి మాట ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... పెద్ద నోట్ల ర‌ద్దు - ఆన్ లైన్ చెల్లింపుల బాట‌ - ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన జీఎస్టీ త‌దిత‌ర కార‌ణాల‌తో మెజారిటీ జ‌నంలోనూ ఇందుకు కాద‌నే స‌మాధానం వ‌స్తోంది. ఈ రెండు, మూడు అంశాల‌ను ప‌క్క‌న‌బెడితే... స‌గ‌టు జీవికి మోదీ పాల‌న బాగున్న‌ట్టుగానే అనిపిస్తోంది.

ఈ విష‌యంలో మ‌న‌కు మ‌నం కాకుండా... అంత‌ర్జాతీయ సంస్థ‌లు ఏం చెబుతున్నాయ‌న్న విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మాత్రం... మోదీ స‌ర్కారు మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌రుస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌త్ఫ‌లితంగా మ‌న జీవ‌న ప్ర‌మాణాలు - క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా క్ర‌మంగా మెరుగ‌వుతున్నాయ‌న్న స‌త్యం మ‌నకు బోధ ప‌డుతోంది. గ్లోబ‌ల్ సోష‌ల్ ప్రొగ్రెస్ ఇండెక్స్ విడుద‌ల చేసిన తాజా నివేదిక‌ను ప‌రిశీలిస్తే ఈ విష‌యం నిజ‌మేన‌ని న‌మ్మ‌క త‌ప్ప‌దు. ఈ నివేదిక‌లో మొత్తం 128 దేశాల్లోని ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను స‌ర్వే చేయ‌గా... భార‌త్ 93వ స్థానంలో నిలిచింది.

128 దేశాలున్న జాబితాలో 93వ స్థానం అంటే.. మ‌న జీవ‌న ప్ర‌మాణాలు ఎలా మెరుగ్గా ఉంద‌ని ప్ర‌శ్నిస్తారా? అయితే ఆ విష‌యానికి కూడా వ‌స్తే... మోదీ ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క ముందు ఈ జాబితాలో మ‌న దేశం 101వ స్థానంలో ఉంది. 2015లో 101 స్థానంలో ఉన్న మ‌న దేశంలో 2016 నాటికి మూడు స్థానాల‌ను మెరుగు ప‌ర‌చుకుని 98వ స్థానానికి చేరుకోగా... ఏడాది తిరిగే లోగానే 2017 జాబితాలో మ‌రో ఐదు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని 93 వ స్థానంలో నిలిచింది. అంటే వ‌రుస‌గా మూడేళ్ల పాటు ఈ విష‌యంలో భార‌త్ వృద్ధి సాధిస్తోంద‌న్న మాటేగా. అంటే మోదీ పాల‌న‌లో మ‌న జీవ‌న ప్ర‌మాణాలు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిన‌ట్టేగా.

ఇదంతా బాగానే ఉన్నా... ఏఏ అంశాల‌కు సంబంధించి మ‌న దేశానికి ఎన్నెన్ని మార్కులు వ‌చ్చాయ‌న్న విష‌యాన్ని ప‌రిశీలిస్తే... బేసిక్ నాలెడ్జ్ అందుబాటుకు సంబంధించి నూటికి 85.57 మార్కులు రాగా, పోష‌కాహారం, క‌నీస వైద్య స‌దుపాయాల విష‌యంలో 84.64 మార్కులు వ‌చ్చాయి. వ్య‌క్తిగ‌త హ‌క్కులు (పౌర హ‌క్కులు)కు సంబంధించి భార‌త్‌కు ఈ ఇండెక్స్ లో72.30 మార్కులు, అంద‌రికీ నివాసం విష‌యంలో 64.42 మార్కులు, వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కు సంబంధించి 60.35 మార్కులు వ‌చ్చాయి. మోదీ పాల‌న‌లో మూడేళ్ల‌లోనే ఈ ఇండెక్స్ లో భార‌త్ త‌న స్థానాన్ని ఏకంగా 8 స్థానాలు మెరుగుప‌ర‌చుకుందంటే... మ‌రో రెండేళ్ల‌లో మ‌రింత మేర ప్ర‌గ‌తి సాధించ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.
Tags:    

Similar News