అవి కావాలి.. ఇవి కావాలి సరే.. ఏపీకి ఏమిస్తారు రేవంత్ సార్?
విడిపోయి కలిసుందామన్న నినాదం గుర్తుందా? సరే.. దాన్ని పక్కన పెట్టేద్దాం. చూస్తుండగానే విడిపోయి పుష్కరానికి దగ్గరకు వచ్చేశాం.;
విడిపోయి కలిసుందామన్న నినాదం గుర్తుందా? సరే.. దాన్ని పక్కన పెట్టేద్దాం. చూస్తుండగానే విడిపోయి పుష్కరానికి దగ్గరకు వచ్చేశాం. కలిసి ఉన్న 58ఏళ్లను పక్కన పెట్టేస్తే.. విడిపోయిన తర్వాత జరిగిన విషయాల్ని వదిలేద్దాం. సూటిగా కొన్ని ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. తిరుమలకు వెళ్లే తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి. ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు తెలంగాణకు ఇచ్చేయాలి. శ్రీశైలానికి వెళ్లినపుడు తెలంగాణ వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. వారి సిఫార్సులకు అనుగుణంగా పనులు జరగాలి. ఇలా చెప్పుకుంటూ పోతే.. కొన్ని వినతులు.. మరికొన్ని డిమాండ్లు ఉన్నాయి.
వీటన్నింటికి ముందు.. ఏపీకి ఏం ఇవ్వాలి? ఏమిస్తాం? అన్న విషయాన్ని తెలంగాణకు చెందిన ఏ ఒక్కరు ఎందుకు చెప్పరు. అయినప్పటికి తెలంగాణ నుంచి వచ్చిన సూచనల మేరకు టీటీడీ బోర్డులో తెలంగాణ వారికి ప్రాతినిధ్యం వహించేలా చేయటంతో పాటు.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఒక అధికారిక నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే.
ఇంత చేసిన దానికి బదులుగా తెలంగాణలోని ఏదో ఒక పుణ్యక్షేత్రంలో కానీ.. మరి దేన్లో అయినా ఏపీకి.. ఏపీ ప్రజాప్రతినిధులకు తగిన మర్యాద, గౌరవం దక్కేలా.. వారి సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాన్ని ఎందుకు తీసుకోరు? అడిగి మరీ.. అవసరమైనది తీసుకుంటున్నప్పుడు.. అంతో ఇంతో తిరిగి ఇవ్వాలి కదా? అలాంటిదేమీ లేకపోవటం దేనికి నిదర్శనం. ఎంతకూ ఇన్ కమింగ్ తప్పించి.. అవుట్ గోయింగ్ అన్నదే ఉండదన్నట్లుగా వ్యవహరించటం ధర్మమేనా?
రవీంద్రభారతిలో ఎస్పీ బాలు విగ్రహాన్ని పెడితే పలువురు ప్రశ్నించారు. ఆక్షేపించారు. అలాంటి వారంతా.. టీటీడీ దర్శనాల కోసం.. టీటీడీ బోర్డులో సభ్యుడి హోదా కోసం సాటి తెలంగాణ ప్రజాప్రతినిధులు.. ముఖ్యమంత్రి ఏపీని కోరుతున్నప్పుడు.. ప్రశ్నించొచ్చు కదా? అలా ఎందుకు అడగాలని నిలదీయొచ్చుకదా? అదెందుకు జరగదు. అలా జరగనప్పుడు.. అడిగే హక్కు ఉండదు కదా? తెలంగాణ నుంచి వచ్చే వినతులకు వీలైనంతవరకు నో చెప్పే పరిస్థితి ఉండదు. సాధ్యం కాని దాని గురించి అడగటమే అనవసరం.
అదే సమయంలో విభజన జరిగిన ఇన్నేళ్లలో ఏపీ కోసం.. ఏపీ ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం ఫలానా నిర్ణయాన్ని తీసుకుంది? అన్నది ఏమైనా చెప్పగలుగుతారా? అలాంటప్పుడు ఏపీని అడిగే ముందు.. ఏపీకి.. ఏపీ ప్రజలకు మనమేం ఇచ్చామన్న విషయాన్ని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న మాట ఆంధ్రోళ్ల నుంచి వినిపిస్తోంది. తాము ఇప్పటికి తెలంగాణ ఉద్యమంలో కీలకమైన విడిపోయి కలిసి ఉందామనే నినాదానికి కట్టుబడి ఉంటామని.. మరి.. ఆ నినాదాన్ని వినిపించిన తెలంగాణ వారు కట్టుబడి ఉన్నారా? ఉంటే.. దానికి సంబంధించిన ఏ ఒక్క అంశమైనా చూపించాలన్న మాట ఏపీలోని పలువురి నోట వినిపిస్తోంది. మరి.. దీనికి తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు.. ప్రజలు ఏమంటారు? అన్నది అసలు ప్రశ్న.