మ‌రికొద్ది సేప‌ట్లో అమ‌రావ‌తి రైతుల సింహ‌గ‌ర్జ‌న

Update: 2021-12-17 09:30 GMT
అమరావతి అందరిదీ అనే నినాదంతో.. రాజధాని ప్రాంతం వెలుపల తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహణకు రైతులు సిద్ధమయ్యారు. తిరుపతి వేదికగా జరగనున్న 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ'కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. భావి తరాల భవిష్యత్తు, మన బిడ్డల బాగు కోసం అమరావతి నిర్మాణం అవసరమనే సందేశాన్ని సభ ద్వారా చాటనున్నారు. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు హాజరు కానున్నారు.

మ‌రికొద్ది సేప‌ట్లోనే ప్రారంభం కానున్న ఈ స‌భ ద్వారా.. రైతులు.. అమ‌రావ‌తి ప్రాధాన్యాన్ని ప్ర‌తి ఒక్క‌రికీ వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. తిరుపతి సభకు అమరావతి నుంచి పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు.

ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న రైతులు తిరుపతిలోనే ఉన్నారు. వారి కుటుంబసభ్యులు కూడా గత రెండు, మూడు రోజుల నుంచి తిరుపతికి చేరుకుంటున్నారు. ప్రత్యేక బస్సుల్లో 29గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. రైతులకు మద్దతుగా సభాస్థలికి రాజధాని గ్రామాల నుంచి, ఇతర ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు. తిరుపతి సభను జయప్రదం చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.

అమరావతి పరిరక్షణ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ సీనియ‌ర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలోనిబీజేపీ బృందం హాజ‌రుకానుంది. కాంగ్రెస్‌, జనసేన, వామపక్ష పార్టీల నేతలు కూడా మహోద్యమ సభకు హాజరుకానున్నారు. మ‌రోవైపు తిరుపతి రైతుల సభకు న్యాయవాదులు తరలివచ్చారు. సభకు ఎందరు రావాలనే నిబంధన ఎక్కడా లేదని లాయర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంక్షల పేరుతో అడ్డుకుంటే కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు.



Tags:    

Similar News