న్ లాడెన్ అమరవీరుడు: ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్య

Update: 2020-06-26 03:30 GMT
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంతోమంది ప్రాణాలను హరించిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను పార్లమెంటు సాక్షిగా ప్రశంసించాడు. లాడెన్ ఉగ్రవాది కాదని, అమరవీరుడన్నారు. అబొట్టాబాద్‌లో అమెరికా దళాలు లాడెన్‌ను చంపినప్పుడు తాము చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పాడు. అతను కేవలం బ్రిటన్ వంటి దేశాలకు మాత్రమే ఉగ్రవాది అన్నాడు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల పట్ల ప్రపంచం నివ్వెరపోయింది.

ఉగ్రవాదులకు అడ్డాగా, సహాయకారిగా పాకిస్తాన్ ఉందనే ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నాయి. ఇప్పుడు కరడుగట్టిన ఉగ్రవాదిని ప్రశంసించడం ద్వారా, పైగా అతనిని అమరవీరుడు అని కొనియాడటం ద్వారా పాకిస్తాన్ వైఖరి ఏమిటో తెలిసిపోతుందని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ గతంలోను లాడెన్‌పై ప్రశంసలు కురిపించాడు.

లాడెన్ స్వతంత్రయోదుడని, ఉగ్రవాది కాడని గతంలో చెప్పాడు. లాడెన్ వివరాలు అమెరికా బలగాలకు తామే ఇచ్చామని, కానీ చంపేందుకు ఆపరేషన్ చేపట్టకూడదని కూడా సూచించామని, అయినప్పటికీ అమెరికా బలగాలు హతమార్చాయన్నాడు. లాడెన్ చనిపోయినప్పుడు బాధపడ్డామని చెప్పాడు. లాడెన్‌ను చంపడం ద్వారా అమెరికా తమను అణిచివేసింది, అవమానించిందన్నాడు. ఉగ్రవాదం పేరుతో అగ్రరాజ్యం తమను పదేళ్ల పాటు ఇబ్బందులకు గురి చేసిందన్నాడు.

9/11 దాడులకు సూత్రధారి బిన్ లాడెన్. 2001 సెప్టెంబర్ 9న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేతలో మూడువేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, అంతకు పదిరెట్లకు పైగా గాయపడ్డారు. అలాంటి వ్యక్తిని ఓ దేశ ప్రధాని ప్రశంసించడం గమనార్హం. గతంలో ఎన్నికలకు ముందు లాడెన్‌ను తీవ్రవాది అనేందుకు సంశయించిన ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు ఏకంగా అతనిని వీరుడు అని ప్రశంసించాడు.
Tags:    

Similar News