బెజవాడలో నోట్లకట్టలు.. హవాలా సొమ్మేనా?

Update: 2020-11-30 08:10 GMT
ఏపీలోని విజయవాడలో భారీగా నోట్లకట్టలను పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఇద్దరు వ్యక్తులు రూ. కోటి నగదును తీసుకెళ్తుండగా టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నోట్లకట్టలు ఎవరు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. అనే విషయంపై మాత్రం ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఇటీవల ఏపీలోని పలుచోట్ల నోట్లకట్టలు బయటపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా విజయవాడలోని పండిట్​  నెహ్రూ  బస్ స్టాండ్ దగ్గర టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు చేయగా ఇద్దరు వ్యక్తుల వద్ద రూ. కోటి నగదు పట్టుబడింది. అయితే సరైన పత్రాలు చూపించక పోవడంతో పోలీసులు  ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వీళ్లిద్దరూ ఒకే ముఠాకు చెందిన వారని పోలీసులు అనుమానిస్తున్నారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు కు చెందిన హవాలా  వ్యాపారులు ఈ దందాను సాగిస్తున్నట్టు సమాచారం.  విజయవాడనుంచి హవాలా మార్గంలో అనంతపురం జిల్లా గుంతకల్లుకు  డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హవాలా దందాలో ఎవరెవరు ఉన్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ డబ్బు గుంతకల్లుకు చెందిన వ్యాపారులదని సమాచారం.

విజయవాడలోని ఎవరివద్ద నుంచి ఈ డబ్బు తీసుకెళ్లారు..అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. విచారణ అనంతరం ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉన్నది. హవాలా మూలాలపై టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ శ్రీనివాసులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల ఏపీలోని పలుచోట్ల హవాలా డబ్బు బయటపడింది.
Tags:    

Similar News