రాహుల్ ఇండియ‌నే!... డౌటే లేద‌బ్బా!

Update: 2019-05-03 17:30 GMT
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో లెక్క‌లేన‌న్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న పార్టీ అధినేత‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు గుప్పిస్తున్న రాహుల్‌కు ఇప్ప‌టికే సుప్రీంకోర్టులో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఆ దెబ్బ నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు రాహుల్ గాంధీ నానా పాట్లు ప‌డాల్సి వ‌చ్చింది. ఆ గోల ముగియ‌కుండానే త‌న పౌర‌స‌త్వంపై రేకెత్తిన వివాదం రాహుల్ ను మ‌రింత‌గా ఇబ్బంది పెట్టింద‌నే చెప్పాలి. అయితే ఊహించ‌ని రీతిలో రాహుల్ నిఖార్సైన భార‌తీయుడేన‌ని ఓ వ్య‌క్తి ఇప్పుడు బ‌ల్ల గుద్ది మ‌రీ చెబుతున్నారు. ఆ వ్య‌క్తి సాదాసీదా వ్య‌క్తేమీ కాదు. రాహుల్ గాంధీ పుట్టిన వెంట‌నే పొత్తిళ్ల‌లో ఆయ‌న‌ను ఎత్తుకున్న వ్య‌క్తి. ఆమే కేర‌ళ‌కు చెందిన మాజీ న‌ర్సు రాజ‌మ్మ వివాతిల్‌.

ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుప‌త్రిలో సోనియా గాంధీ ప్ర‌స‌వించిన రాహుల్ ను తొలిసారి ఎత్తుకున్న ఆసుప‌త్రి సిబ్బందిలో రాజ‌మ్మ కూడా ఒక‌ర‌ట‌. ఈ విష‌యాన్ని వేరే ఎవ‌రో చెప్ప‌లేదు. నాడు తెల్ల‌గా, బొద్దుగా, చూడ‌గానే ముద్దులొలికేలా ఉన్న రాహుల్ గాంధీని ఎత్తుకుని త‌న్మ‌య‌త్వంలో మునిగిపోయిన రాజ‌మ్మే ఆ విష‌యాన్ని ఇప్పుడు స్వ‌యంగా వెల్ల‌డించారు. రాహుల్ పౌర‌స‌త్వంపై ఇక అన‌వ‌స‌ర రాద్ధాంతం వ‌ద్ద‌నుకున్నారో, ఏమో తెలియ‌దు గానీ.. రాహుల్ జ‌న్మించింది ఢిల్లీలోనేన‌ని, రాహుల్ భార‌తీయుడేన‌ని చెప్పేందుకు ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాల‌ని కూడా ఆమె ప్ర‌శ్నించారు.

రాహుల్ జ‌న‌నం, రాజ‌మ్మ ప్ర‌స్థానం వివ‌రాల్లోకి వెళితే... ఇప్పుడు దక్షిణాది నుంచి పోటీకి దిగిన రాహుల్ గాంధీ కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి నామినేష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే క‌దా. ఇదే వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గంలోని క‌ల్లూరుకు చెందిన రాజ‌మ్మ‌... న‌ర్సింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసిన త‌ర్వాత ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుప‌త్రిలో ట్రైనీ న‌ర్సుగా ప‌నిచేశార‌ట‌. ఆ స‌మ‌యంలోనే రాజీవ్ గాంధీ స‌తీమ‌ణి సోనియా గాంధీ ఆ ఆసుప‌త్రికి ప్ర‌స‌వం కోసం వ‌చ్చార‌ట‌. ఈ క్ర‌మంలో సోనియా ప్ర‌స‌వం త‌ర్వాత ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న ఇత‌ర నర్సుల మాదిరే... రాజ‌మ్మ కూడా రాహుల్ ను త‌న చేతుల్లోకి తీసుకుని ముద్దు చేశార‌ట‌. ఆ త‌ర్వాతి కాలంలో రాజ‌మ్మ భార‌త ఆర్మీలో న‌ర్సుగా చేరార‌ట‌. కొంత‌కాలం పాటు సైన్యంలోనే ప‌నిచేసిన రాజ‌మ్మ‌... త‌ద‌నంత‌రం వీఆర్ఎస్ తీసుకుని 1987లోనే త‌న సొంతూరికి వెళ్లిపోయార‌ట‌.

రాహుల్ పౌర‌స‌త్వంపై వెల్లువెత్తుతున్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో మీడియా ముందుకు వ‌చ్చిన రాజ‌మ్మ ఏం చెప్పారంటే...*ఎంతో ముద్దుగా ఉన్న రాహుల్‌ గాంధీని మొదటగా చేతుల్లోకి తీసుకున్న వ్యక్తుల్లో నేనూ ఒకదాన్ని. ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఆయన జన్మించారనడానికి నేనే ఒక సాక్ష్యం. ప్రధాని ఇందిరా గాంధీ మనుమడిని ఎత్తుకోవడాన్ని ఎంతో అదృష్టంగా ఫీలయ్యాను. ఆరోజు రాహుల్‌ తండ్రి రాజీవ్‌ గాంధీ, బాబాయ్‌ సంజయ్‌ గాంధీ లేబర్‌ రూం బయట ఎదురుచూస్తూ ఉన్నారు. నాకు ఆ విషయాలన్నీ ఇంకా గుర్తున్నాయి. వీటి గురించి నా బంధువులకు కథలు కథలుగా చెబుతాను* అని చెప్పుకొచ్చారు. సో.. ఇక రాహుల్ పౌర‌స‌త్వంపై ఇక ఎలాంటి ర‌చ్చ లేద‌న్న మాట.


Tags:    

Similar News