హైదరాబాద్ మహానగరానికి 'డైనమిక్' గుర్తింపు

Update: 2020-01-19 05:09 GMT
కోట్లాది మంది హైదరాబాదీయులు గర్వపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరానికి మరో అరుదైన గౌరవాన్ని.. గుర్తింపును తాజాగా సొంతం చేసుకుంది. ప్రపంచ డైనమిక్ నగరాల జాబితాలో వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 130 నగరాలపై జరిపిన అధ్యయనానికి సంబంధించిన నివేదిక విడుదలైంది. ఈ రిపోర్టును తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

2020 సంవత్సరానికి మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. దీనిపై మంత్రి కేటీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలోతొలి 20 స్థానాల్లో మన దేశంలోని ఏడు నగరాలు నిలవగా.. హైదరాబాద్ అందులో మొదటి స్థానంలో నిలవటం గమనార్హం.

రెండో స్థానంలో బెంగళూరు.. ఐదో స్థానంలో చెన్నై.. పన్నెండో స్థానంలో ఫూణె.. పదహారో స్థానంలో కోల్ కతా.. ఇరవయ్యో స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. వరుసగా మూడో ఏడాది హైదరాబాద్ మహానగరం అగ్రస్థానంలో నిలవటంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2015లో 28వ స్థానంలో ఉండగా.. 2016లో ఇది కాస్తా ఐదో స్థానానికి చేరి మెరుగైన ర్యాంకింగ్ ను సొంతం చేసుకుంది. 2018 నుంచి వరుసగా అగ్రస్థానంలో నిలవటం విశేషం. 2019లో బెంగళూరుతో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్న హైదరాబాద్.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా బెంగళూరును వెనక్కి నెట్టి హైదరాబాద్ ఒక్కటే అగ్రస్థానంలో నిలిచినట్లుగా ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ జేఎల్ఎల్ సంస్థ పేర్కొంది. ఈ సంస్థ తాజాగా రూపొందించిన ఇండెక్స్ 2020లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఎలా నిలిచిందో చెప్పుకొచ్చారు. స్థిరంగా అభివృద్థిపథంలో నడవటంతో పాటు.. మిగిలిన అంశాలు కూడా కారణంగా చెబుతున్నారు. ఈ నివేదికను సింఫుల్ గా తీసుకోకూడదని చెబుతున్నారు. ఎందుకంటే ఆక్సఫర్డ్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఐక్యరాజ్య సమితి డేటాను ఉపయోగించి 130 దేశాల్లోని నగరాల్ని పరిశీలించి.. అధ్యయనం చేయటం ద్వారా ఈ ర్యాంకింగ్ ను ఫైనల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే నిజమైతే.. హైదరాబాదీయులే కాదు.. తెలుగువారంతో ఎంతో సంతోషానికి గురి కావాల్సిన సందర్భంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News