ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: హైస్కూళ్లు ఇంటర్మీడియట్ కాలేజీలుగా

Update: 2020-07-14 10:00 GMT
పాలనలో.. విధానపరమైన నిర్ణయాల్లో సంస్కరణలు.. మార్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో పలు మార్పులు చేసుకుంటూ వస్తోన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉన్నత పాఠశాలలను ఇంటర్మీడియట్ కళాశాలలుగా మార్చనున్నట్టు సమాచారం. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హైస్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిసింది.

ముఖ్యంగా మండలకేంద్రంలోని  హైస్కూళ్లను ఇంటర్‌‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. ఈ విషయమై గత వారంలో విద్యాశాఖ మంత్రి సురేశ్ ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. పదో తరగతి పాసైన చాలా మంది ఇంటర్‌ చదివేందుకు ఎందుకు ఉత్సాహం చూపడం లేదనే అంశం ఆ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అయితే దీనికి గల కారణాలు తెలుసుకున్నారు. దూరభారంతోనే ఈ సమస్య వస్తోందని గుర్తించారు. ఈ క్రమంలో మండల స్థాయిలోనే ఇంటర్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అడ్మిషన్లను గణనీయంగా పెంచొచ్చని ఉన్నతాధికారులు చర్చించినట్లు తెలిసింది. ఇదే విషయంపై సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. దీనికి వెంటనే ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం అమలైతే  జిల్లాల్లోని మండల కేంద్రాల్లో ఉన్న హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ కానున్నాయి.
Tags:    

Similar News