వార్ జోన్ లోకి వెళ్లే మీడియాను ఎందుకు అడ్డుకుంటున్నారు?

Update: 2020-07-23 04:36 GMT
తానేం అనుకుంటే అదే జరగాలనే తీరు ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్న విషయం పాలకుల్ని ఇటీవల కాలంలో తరచూ మరిచిపోతున్నారు. ఏమైనా సరే.. ఎవరేమన్నా సరే.. తాము అనుకున్నది మాత్రమే జరగాలనుకోవటం ఈ మధ్యన అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. హద్దులుగా గీస్తున్న గీతలు ఇప్పుడు సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. ఇలాంటివేళలో స్పందిస్తున్న కోర్టుల కారణంగా కొంతమేర ఉపశమనం కలిగిస్తున్న పరిస్థితి.

తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి.. దాని స్థానంలో కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే పనుల్ని చేపట్టింది. ఇదిలా ఉంటే.. కూల్చివేతను కవర్ చేసేందుకు మీడియాకు అనుమతి ఇవ్వని పరిస్థితి. దీనిపై తాజాగా కోర్టు వేసిన పిటిషన్ పై విచారణ సాగింది. ఈ సందర్భంగా మీడియాను అనుమతించని వైనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

యుద్ధం జరుగుతున్న ప్రదేశాల్లోకే మీడియాకు అనుమతించే పరిస్థితి ఉంటుందని.. అలాంటి కూల్చివేత పనుల్ని అంత రహస్యంగా చేయాల్సిన అవసరం ఏమిటని సూటి ప్రశ్నను సంధించింది.  దీనికి బదులిచ్చిన ప్రభుత్వ న్యాయవాది పేల్చివేతల ద్వారా భవనాల్ని కూల్చివేస్తున్నామని.. ప్రమాదాలు జరుగుతాయన్న ఉద్దేశంతోనే మీడియాను అనుమతించలేదన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు కూల్చివేత పనుల్ని అంత రహస్యంగా చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

గుప్తనిధులు ఉన్నాయని.. అందుకే రహస్యంగా కూల్చివేతలు చేపడుతున్నారన్నవిమర్శలు వస్తున్న వేళ.. కూల్చివేత పనుల్ని పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. కూల్చివేత ప్రక్రియ ఎలా సాగుతుందన్న విషయాన్ని ప్రజలు తెలుసుకునే హక్కు ఉందన్నారు. కూల్చివేత వీడియోల్ని ప్రభుత్వమే తీసి పంపొచ్చుగా అన్న సూచన చేశారు. మీడియాకు ఒక పాయింట్ కేటాయించి.. కూల్చివేత పనులునిలిపివేసిన సమయంలో అనుమతి ఇచ్చి.. మళ్లీ పంపిచేయొచ్చుగా? అన్న కోర్టు.. రోజువారీగా కూల్చివేతకు సంబంధించిన ఫోటోల్ని.. వివరాల్ని మీడియాకు ఇవ్వొచ్చన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయం తెలుసుకొని చెబుతానని.. అందుకు వారం రోజులు సమయం కావాలని కోరారు. అందుకు స్పందించిన కోర్టు.. ఆ విషయాన్ని తెలుసుకోవటానికి వారం టైం ఎందుకు? గురువారం లోపు తెలుసుకొని కోర్టు చెప్పాలని విచారణను వాయిదా వేశారు. ఈ విషయంపై తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.  
Tags:    

Similar News