అర్థరాత్రి వేళ దహన సంస్కారాలు అందుకేనట

Update: 2020-10-06 16:00 GMT
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హాథ్రస్ ఉదంతానికి సంబంధించి యోగి సర్కారు కిందా మీదా పడుతోంది. ఈ ఉదంతం బయటకు వచ్చిన నాటి నుంచి యూపీ సర్కారు తప్పుల మీద తప్పులు చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. అన్నింటికి మించిన బాధితురాలిపై ఎలాంటి అత్యాచారం జరగలేదన్న బుకాయింపుతో పాటు.. అర్థరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా అంతిమ సంస్కారాల్ని నిర్వహించటం సంచలనంగా మారింది.

తాజాగా అర్థరాత్రి అంత్యక్రియలపై దేశ అత్యున్నత న్యాయస్థానానికి యూపీ సర్కారు వివరణ ఇచ్చింది. హాథ్రస్ బాధితురాలి అంత్యక్రియలు తర్వాతి రోజు జరిపి ఉంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకునే అవకాశం ఉందని.. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.

నిఘా వర్గాల రిపోర్టు ఆధారంగానే తామీ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. హత్యాచార ఉదంతంలో తీవ్రంగా గాయపడిన దళిత బాలిక సెప్టెంబరు 29 ఉదయం ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో మరణించింది. ఆమె డెడ్ బాడీని హుటాహుటిన స్వగ్రామానికి తరలించారు. అదే రోజు అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలను పూర్తి చేశారు.

ఇదే విషయాన్ని ఒక న్యూస్ చానల్ బయట పెట్టటంతో తీవ్రస్థాయిలో దుమారంగా మారింది. దీనిపై సుప్రీం వివరణ కోరింది బాలికకు వైద్య సేవలు అందించిన సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వద్ద జరిగిన ధర్నా లాంటిదే.. బాధితురాలి అంత్యక్రియల సమయంలో చోటు చేసుకునే ప్రమాదం ఉందని.. అదే జరిగితే తీవ్ర పరిణామాలుచోటు చేసుకుంటాయన్న ఉద్దేశంతో రహస్యంగా అంత్యక్రియల్ని నిర్వహించినట్లుగా చెబుతున్నారు.

ఈ అంశానికి కులం.. మతం రంగు పులిమి దాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని.. అందుకే.. అత్యవసరంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చినట్లుగా సుప్రీంకు యూపీ సర్కారు పేర్కొంది. మొత్తానికి అర్థరాత్రి వేళ తాను చేసిన పనిని యోగి సర్కారు పెద్ద ఎత్తున సమర్థించుకుందున్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News