సింధును కర్ణాటక అమ్మాయిగా చేసేసిన ‘సీఎం’

Update: 2016-08-24 10:01 GMT
రియో ఒలింపిక్స్ లో తన అద్భుత ఆట తీరుతో బ్యాడ్మింటన్ లో రజత పతకాన్ని సాధించిన పీవీ సింధు విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆమెను సన్మానించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీపోటీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సత్కారం విషయంలోనే కాదు.. సింధును మా ప్రాంతం అమ్మాయి అంటే మా ప్రాంతం అమ్మాయి అంటూ రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు ఒకరికంటే పోటీగా మరొకరు వ్యాఖ్యలు చేస్తున్న వైనం తెలిసిందే.

సింధు తల్లిదండ్రులు ఆంధ్రాప్రాంతానికి చెందిన వారంటూ నిన్న జరిగిన సన్మాన కార్యక్రమంలో విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఎన్నిసార్లు ప్రస్తావించారో తెలిసిందే. దానికి ఒక రోజు ముందు తెలంగాణ రాష్ట్ర మంత్రులు పలువురు సింధును తెలంగాణ బిడ్డగా అభివర్ణించారు. దీంతో.. సింధు మా ప్రాంతానికి చెందిన అమ్మాయి అంటే మా ప్రాంతానికి చెందిన అమ్మాయన్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ సరిపోదన్నట్లగా తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

సింధును కర్ణాటక అమ్మాయిగా పేర్కొన్న ఆయన .. సింధు పేరును కూడా సరిగా ఉచ్చరించకపోవటం గమనార్హం మరోవైపు.. ఒలింపిక్స్ రెజ్లింగ్ లో కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్ ను హర్యానా ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. ఆమెకు ప్రకటించిన రూ.2.5 కోట్ల నజరానాను అందించారు. దేశానికి రెండంటే రెండే పతకాలు సాధించిన విజేతలు ఏప్రాంతానికి చెందిన వారన్న విషయం కూడా హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ కు తెలియకపోవటం ఏమిటో..?
Tags:    

Similar News