మామతో గొడవల్లేవు..పార్టీలో నెంబర్ 2 లేరంట

Update: 2016-02-11 03:56 GMT
పార్టీలో తనకు తిరుగులేని స్థానం నుంచి తన ప్రాధాన్యత తగ్గిన విషయాన్ని నేరుగా ఒప్పుకోగలరు? అందులోకి స్వయాన మేనమామ అంటే అంతులేని అభిమానం.. అంతకు మించిన భయభక్తులు.. తన రాజకీయ జీవితానికి కర్త.. కర్మ.. క్రియ లాంటి మామపై మనసు పొరల్లో ఎంత అసంతృప్తి మాత్రం ఉంటే హరీశే కాదు.. మరెవరూ కూడా బయటపడలేని పరిస్థితి. అందుకే.. పుష్కరం కంటే ఎక్కువగా సాగిన తెలంగాణ ఉద్యమంలో మేనమామకు తోడునీడగా ఉంటూ.. కేటీఆర్ ఎంట్రీ తర్వాత కూడా పార్టీలో నెంబర్ టూగా హరీశ్ కొనసాగటం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి రోజురోజుకీ కేటీఆర్ ఎదిగిపోవటం.. ఆయనతో పోటీ పడలేకపోవటం హరీశ్ కు ఇబ్బందే. అలా అని దాన్ని బయటకు చెప్పుకోలేరు. మనసులో అసంతృప్తి ఉన్నా.. కొన్నింటిని కాదనలేని పరిస్థితి. అలాంటిదే కేటీఆర్ ఎదుగుదల కూడా. అందుకే.. ఆయన మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. అయితే.. మీడియాలో తనపై వస్తున్న కథనాలు హరీశ్ ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అసహనం చెందేలా చేస్తున్నాయి. తనకు ఏ విషయం మీద మాట్లాడటానికి సుతారమూ ఇష్టపడరో అదే విషయంపై వివరణ ఇవ్వాల్సి రావటం కాస్త కష్టమైన పనే.

అందుకే.. హరీశ్ అప్పుడప్పుడు కేటీఆర్ ఇష్యూ మీద కానీ.. నెంబర్ టూ అంశం మీద కానీ ప్రశ్న అడిగితే ముఖంలో రంగులు మారతాయి. బాడీ లాంగ్వేజ్ లో అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే.. ఇలాంటివన్నీ ఆయనకు బాగా అలవాటు అయిన వారు మాత్రమే గుర్తించే అంశాలు. తనను ఇరుకున పెట్టే ప్రశ్న అయినప్పటికీ ఎలాంటి త్రోటుపాటుకు గురి కాకుండా.. ఎదుటోడ్ని ఇబ్బంది పెట్టే నేర్పున్న హరీశ్ తాజాగా.. పార్టీకి సంబంధించి కొన్ని అంశాల మీద స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

తనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలాంటి విభేదాలు లేవంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో పార్టీలో నెంబర్ 2 అంటూ ఎవరూ లేరని.. అంతా కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని చెబుతూ.. ‘‘కేసీఆర్ కు మరో 20 ఏళ్లు పాలించే సామర్థ్యం ఉంది’’ అని చెప్పేశారు. మేనమామతో తనకు ఎలాంటి పంచాయితీ లేదని చెబుతూనే.. దానికి నిదర్శనమన్నట్లుగా టీటీడీపీకి చెందిన కీలకనేత ఎర్రబెల్లిని స్వయంగా తానే ఎత్తుకొచ్చేసి పార్టీలో చేర్చటం ద్వారా పార్టీకి తానెంత కమిటెడ్ సోల్జర్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
Tags:    

Similar News