హ‌రీశ్ బొమ్మ క‌నిపించ‌కూడ‌దా?

Update: 2019-03-18 04:56 GMT
ఎంత తెలివైనోడైనా ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర త‌ప్పు చేస్తార‌ని చెబుతుంటారు. ఏదైనా జ‌ర‌గాలని రాసి పెట్టి ఉంటే.. దానికి మొద‌లు ఫ‌లానా అంటూ ఉండాలి. ఎన్నో ఘ‌ట‌న‌లు జ‌రిగితే కానీ.. మ‌రేదో జ‌ర‌గ‌దు. ఈ వేదాంతం అంతా ఎందుకంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్న‌ది చోటు చేసుకోవ‌టానికి చాలానే జ‌రిగింది. కేసీఆర్ దీక్ష చేశారనో.. కేసీఆర్ పార్టీకి ఉన్న ఇద్ద‌రు ఎంపీల‌తో చేసిన రాయ‌బారాల‌తోనో.. కేసీఆర్ చేసే ఉద్య‌మంతోనో ప్ర‌భావిత‌మై తెలంగాణ రాష్ట్రాన్ని అర్జెంట్ అన్న‌ట్లుగా ఇచ్చేయ‌లేదు. దాని వెనుక లెక్క‌లు.. అంచ‌నాలు.. ఆలోచ‌న‌లు.. ప‌థ‌కాలు.. వ్యూహాలు ఎన్నో ఉన్నాయన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఇప్ప‌టి వ‌ర‌కూ చెప్పిందంతా ఒక వాద‌న‌.

ఇదే అంశాన్ని మ‌రోలా కూడా చెప్పొచ్చు. కాంగ్రెస్ ప‌వ‌ర్ పోవాల‌న్నా.. మ‌ళ్లీ కోలుకోలేనంత దెబ్బ త‌గ‌లాల‌న్నా  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే.  తెలంగాణ రాష్ట్రం అన్న‌ది ఏర్పాటు కాలేద‌నుకుందాం. ఎన్నిక‌ల వేళ ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోలేద‌నుకుందాం. ఏమ‌వుతుంది?  మ‌హా అయితే పార్టీకి వ‌చ్చే సీట్లు కాసిన్ని త‌గ్గేవి కానీ.. రెండు తెలుగు  రాష్ట్రాల్లో ఇప్పుడున్నంత ద‌రిద్రంగా అయితే కాంగ్రెస్ ప‌రిస్థితి ఉండేది కాద‌న్న విష‌యాన్ని ఎవ‌రైనా ఒప్పుకుంటారు. ఎందుకిలా జ‌రిగిందంటే.. కాంగ్రెస్ తాను చేసిన త‌ప్పుల‌కు మూల్యం చెల్లించాల్సింద‌ని రాసి పెట్టి ఉండొచ్చు.

ఒకే విష‌యం మీద ప‌లు వాద‌న‌లు వినిపించొచ్చు. అయితే.. ఇదంతా త‌ర్క‌బద్ధంగా ఉండాలే త‌ప్పించి ఏదో నాలుగు మాట‌లు చెప్పేస్తే స‌రిపోదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక తెర వెనుక ఎన్నో అంశాలు పని చేశాయ‌న్న విష‌యాన్ని ప్రాక్టిక‌ల్ గా ఆలోచించే వారు ఎవ‌రైనా ఒప్పుకుంటారు. ఇప్పుడు చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు కూడా అలాంటివే. కేసీఆర్  లాంటి బ‌ల‌మైన నేతకు తిరుగులేనట్లుగా సాగే కాలం ఎల్ల‌ప్పుడూ ఉంటుందా?  ఆయ‌న‌కు ఫెయ్యిలూర్ అన్న‌ది ఉండ‌దా? అంటే.. అవును.. ఉండ‌ద‌ని ఎవ‌రూ చెప్ప‌రు.

మ‌రి.. ఆయ‌న డౌన్ ట్రెండ్ ఎక్క‌డో అక్క‌డ షురూ కావాల్సిందే. ఎంత ఎగిసిన కెర‌ట‌మైనా ఒక ద‌శ దాటిన త‌ర్వాత కింద‌కు ప‌డాల్సిందే. అది ప్ర‌కృతి ధ‌ర్మం. మ‌రి.. కేసీఆర్ విష‌యంలో అంటే.. ఆయ‌న్ను ఎవ‌రో దెబ్బ తీయాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న‌కు ఆయ‌నే దెబ్బ తీసుకుంటార‌ని చెప్పాలి. ఎందుకంటే.. గ‌డిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకున్న ప‌రిణామాల్ని సాపేక్షంగా చూస్తే ఈ విష‌యం అర్థ‌మ‌వుతుంది.

పైకి అంతా బాగుంద‌న్న‌ట్లు అనిపించినా.. కేసీఆర్ సొంత మీడియాలో త‌న మేన‌ల్లుడి ఫోటోను.. ఆయ‌న‌కు సంబంధించిన వార్త‌ల మీద ప‌రిమితులు విధించ‌టం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఈ ప‌రిణామం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చివ‌ర‌కు.. ఎన్నిక‌ల వేళ హ‌రీశ్ అవ‌స‌రం రావ‌టం.. కేసీఆర్ మీద వ్య‌తిరేక‌త ఎక్కువైంద‌ని.. హ‌రీశ్ ను అన్యాయం చేస్తున్నార‌న్న వాద‌న జోరందుకున్న వేళ‌.. మ‌ళ్లీ ఆయ‌న ఫోటోలు వేయ‌టం.. ఆయ‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం షురూ అయ్యింది.

ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యాన్ని అందుకోవ‌టం.. త‌న కొడుక్కి రాజ్యాధికారాన్ని బ‌దిలీ చేసే ప్ర‌క్రియ‌లో భాగంగా కేటీఆర్ ను టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చేయ‌గా.. మేన‌ల్లుడు హ‌రీశ్ కు మంత్రివ‌ర్గంలో స్థానం కూడా ఇవ్వ‌క‌పోవ‌టాన్ని తెలంగాణ స‌మాజం గుర్తించింది.  అరే.. మేన‌మామ అంటే అంత క‌మిట్ మెంట్ ఉన్న హ‌రీశ్ కు ఇలా అన్యాయం చేస్తారేంటి?  ఆయ‌న్ను ఎందుకు ప‌క్క‌న పెడుతున్నార‌న్న చ‌ర్చ జ‌రిగినా.. ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోన‌ట్లుగా  కేసీఆర్ వ్య‌వ‌హ‌రించ‌టం ఒక ఎత్తు అయితే.. అప్పుడ‌ప్పుడు క‌లుపుగోలుగా వ్య‌వ‌హ‌రించే కేటీఆర్‌.. వ్యూహాత్మ‌కంగా త‌న బావ‌ను పొగిడేసే తీరును ప్ర‌ద‌ర్శిస్తూ హ‌రీశ్ కు అన్యాయం జ‌ర‌గ‌టం లేద‌ని.. ఏదో చేయ‌టానికే హ‌రీశ్ కు ప‌ద‌వి ఇవ్వ‌లేద‌న్న స‌మాధానాన్ని కొంద‌రు ఫీల్ కావ‌టం జ‌రుగుతోంది.

ఇలా అనుకొని స‌మాధాన ప‌డే వారికి సైతం సందేహానికి గుర‌య్యేలా కొన్ని ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. క‌రీంన‌గ‌ర్ లో కేసీఆర్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని షురూ చేసే సంద‌ర్భంలో అన్ని ప‌త్రిక‌ల‌కు మొద‌టి పేజీ నిండా పె..ద్ద యాడ్ ఇచ్చి అందులో కేసీఆర్‌.. కేటీఆర్..ఈటెల రాజేంద‌ర్.. వినోద్‌.. కొప్పుల ఈశ్వ‌ర్ లాంటి వారి ఫోటోల్ని పెద్ద‌గా వేసేసి.. మ‌రో 28 మంది ఫోటోల్ని బుజ్జిబుజ్జిగా వేశారు.

నిజానికి ఈ 28 మంది ఫోటోల్లో కొంద‌రి పేర్లు అయితే చ‌ప్పున చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇంత‌మంది ఫోటోలు వేయ‌గాలేంది.. హ‌రీశ్ రావు లాంటి వ్య‌క్తి ఫోటో ఎందుకు వేయ‌న‌ట్లు?  అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఒక‌టి త‌ర్వాత ఒక‌టి చొప్పున అదే ప‌నిగా హ‌రీశ్ ను ప‌క్క‌న పెట్టేయ‌టం.. ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా వ్య‌వ‌హ‌రించ‌టం.. పార్టీలో హ‌రీశ్ మాట వినిపించ‌కుండా చేయ‌టం ద్వారా కేసీఆర్ ఏం సాధిద్దామ‌నుకుంటున్నారు? అన్న‌ది ప్ర‌శ్న‌.

టీఆర్ఎస్ లో కేసీఆర్ కు తిరుగులేదన్న‌ది నిజం. దాన్ని ఎవ‌రూ కాద‌న‌రు. అదెంత నిజ‌మో..హ‌రీశ్ ను విస్మ‌రించాల‌నుకోవ‌టం అంతే త‌ప్పు అవుతుంద‌న్న చిన్న విష‌యాన్ని కేసీఆర్ ఎందుకు మ‌ర‌చిపోతున్నారు? అన్న‌ది ప్ర‌శ్న‌. త‌న‌కు తిరుగులేద‌న్న కాన్ఫిడెన్స్ త‌ప్పు కాదు. కానీ.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఉండ‌కూడ‌దు. ప్ర‌స్తుతం కేసీఆర్ లో క‌నిపిస్తుంద‌దే.

హ‌రీశ్ అన్న పేరు వినిపించ‌కూడ‌దు.. హ‌రీశ్ ఫోటో క‌నిపించ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న ఒక స్థాయి వ‌ర‌కూ ఓకే. కానీ.. అది ఎక్కువ అయ్యే కొద్ది కేసీఆర్ భ‌విష్య‌త్ తిరోగ‌మ‌నానికి అదో నాంది అవుతుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఎల్ల‌కాలం ఒక‌రి హ‌వానే న‌డ‌వ‌దు. దేనికైనా ప్రారంభం.. పీక్స్ అన్న‌వి ఎలానో.. అలానే డౌన్ ఫాల్ అన్న‌ది కూడా ఉంటుంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఆ డౌన్ ఫాల్ కు ఎన్నో త‌ప్పులు కార‌ణ‌మ‌వుతాయి. కేసీఆర్ ఎపిసోడ్ లో హ‌రీశ్ ను విస్మ‌రించాల‌న్న  ఆలోచ‌నే నాంది కావొచ్చు. ఆ విష‌యాన్ని కేసీఆర్ ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే అంత మంచిది. జ‌ర‌గాల‌ని రాసిపెట్టిన దానిని ఎవ‌రెన్ని చెప్పినా.. వినాల్సినోళ్ల‌కు విన‌ప‌డ‌వంతే.


Tags:    

Similar News