కాందహార్‌ హైజాక్‌ ఎపిసోడ్‌ తెర వెనుక స్టోరీ

Update: 2015-07-03 08:07 GMT
వాజ్‌పేయ్‌ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నేపాల్‌ ఖాట్మాండూ నుంచి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానాన్ని హైజాక్‌ చేసి దాన్ని మొదట అమృత్‌సర్‌.. అనంతరం పాక్‌ లాహోర్‌.. ఆపై అప్ఘనిస్తాన్‌ కాందహార్‌కు తీసుకెళ్లిన వైనం తెలిసిందే. దీనికి సంబంధించి తెర వెనుక జరిగిన కథ ఒకటి బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తోంది.

తాజాగా విడుదలైన ఒక పుస్తకం దీనికి సంబంధించి వివరాల్ని బయటకు తెచ్చి మనవాళ్లు చేతకాని దద్దమ్మలుగా ఎలా మిగిలారన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా తెలియజెప్పే ప్రయత్నం చేసింది. హైజాకర్లను మట్టుపెట్టే అవకాశాన్ని చేతలారా వదిలిపెట్టి.. అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదుల్ని దేశం నుంచి తరలించే అవకాశం ఇచ్చేలా చేశారన్న ఆరోపణను తెరపైకి తీసుకొచ్చింది.

తాజా పుస్తకాన్ని నమ్మాల్సిన అవసరం ఉందా? అంటే.. నమ్మే ఛాన్సులే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పుస్తకం రాసి వ్యక్తి అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు. హైజాక్‌ జరిగిన సమయంలో రా చీఫ్‌గా ఉన్న ఏఎస్‌ దౌలత్‌ ఈ బుక్‌ రాశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర అంశాల్ని బయటకు తీసుకొచ్చారు.

ఖాట్మాండు నుంచి విమానం బయలుదేరిన కాసేపటికే ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్‌ చేయటం.. దాన్ని అమృత్‌సర్‌లో ప్యూయల్‌ కోసం దింపటం తెలిసిందే. ఈ సమయంలోనే ఉగ్రవాదుల్ని ఫినిష్‌ చేసేందుకు పంజాబ్‌ పోలీస్‌ బాస్‌ పక్కా ప్లాన్‌ వేశారు. ఆ ప్లాన్‌ కానీ అమలు చేసి ఉంటే.. తీవ్రవాదులు అక్కడికక్కడే ఫినిష్‌ అయిపోయేవారట.

కానీ.. ఈ ఇష్యూని క్లోజ్‌ చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలోని ఉన్నతాధికారులు ఒకరినొకరు తిట్టుకోవటమే సరిపోయిందని.. సమస్యను పరిష్కరించే విషయం మీద వారు పెద్దగా దృష్టి సారించలేదని దౌలత్‌ చెబుతున్నారు.

ఈ కారణం చేతనే.. ఉగ్రవాదులు అమృత్‌సర్‌ నుంచి లాహోర్‌.. ఆ తర్వాత కాందహార్‌కు తీసుకెళ్లే అవకాశం లభించిందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఏ మాత్రం జాగ్రత్తగా వ్యవహరించినా.. అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులు భారత్‌ చేజారే వారు కాదని దౌలత్‌ ప్రస్తావించారు. ప్రపంచం దృష్టిలో చేతకాని దద్దమ్మలుగా మిగిలిపోవటానికి వాజ్‌పేయ్‌ సర్కారులోని కీలక అధికారులని ఆయన తేల్చారు. ఆసక్తికరంగా ఆయన.. అందుకు బాధ్యులైన అధికారుల పేర్లను మాత్రం ప్రస్తావించకపోవటం గమనార్హం.

Tags:    

Similar News