దేవుడా.. శ్మశానంలోనూ ‘కోవిడ్’ బాదుడు

Update: 2021-05-10 04:04 GMT
నిజమే.. జనాలు తప్పులు చేసి ఉండొచ్చు. ఎంత తప్పులు చేస్తే మాత్రం.. మరీ ఇంత దారుణమా? మనిషి చావును సైతం సొమ్ము చేసుకోవాలన్న దుర్మార్గం ఇప్పటివరకు చూసింది లేదు. కానీ.. ఇప్పుడు చూస్తుంటే.. దేవుడా.. మాకేమిటీ పరీక్ష అనుకోకుండా ఉండలేం. అయిన మనిషిని కోల్పోయి.. పుట్టెడు శోకంలో ఉన్న వేళలో.. ఆ పరిస్థితిని సొమ్ము చేసుకోవాలనుకునే తీరు దేనికి నిదర్శనం?

ఇప్పుడు చెప్పబోయే సంఘటన గుంటూరులో చోటు చేసుకున్నప్పటికి.. ఇలాంటివి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలానే చోటు చేసుకుంటున్నాయి. కాకపోతే.. కొన్ని బయటకు వస్తుంటే.. మరికొన్ని రావట్లేదంటే. ఇక్కడ ఒక ప్రాంతాన్నో.. ఒక పట్టణాన్నో తప్పు పట్టటం లేదు. అన్నిచోట్ల ఇలాంటివి ఉంటున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు.. వారి కష్టాన్ని సొమ్ము చేసుకోవాలనుకోవటం సరికాదు.

కొద్ది మంది.. తమ ప్రాణాలకు తెగించి మరీ.. సాయం చేస్తున్నారు. తమకున్న దాన్లో కష్టపడి సహాయ సహకారాలు అందిస్తున్నారు. తమ చుట్టు ఉన్న వారికి మేమున్నామన్న ధీమాను అందిస్తున్నారు. ఇలాంటి సానుకూలతతో పాటు.. మరోవైపు శవాల మీద వ్యాపారం చేసే అంబులెన్సులు.. శశ్మాన సిబ్బంది.. తప్పుడు రెమిడెసివర్ మోసగాళ్లు ఉన్నారు. ఇందుకు కారణం.. వారి పేదరికం.. అనుకోని వరంలా అనిపించిన అవకాశం కావొచ్చు. ఇలాంటి సందర్భాల్లో వారిని కంట్రోల్ చేయటం కన్నా.. వారి కష్టానికి తగినంత ఆర్థిక దన్ను ప్రభుత్వం నుంచి లభిస్తే.. మార్పు సాధ్యమవుతుంది.

ఇంతకీ గుంటూరులో జరిగిందేమంటే.. పాత గుంటూరు పట్టణంలో హిందూ శ్శశాన వాటికకు సంబంధించి బయటకు ఒక బోర్డు ఏర్పాటు చేశారు. అందులో సహజ మరణాల అంత్యక్రియలకు రూ.2200, కొవిడ్ మరణాలకు రూ.5100గా డిసైడ్ చేశారు. ఈ నిర్ణయాన్ని తీసుకున్నది అధికారికమే అన్నట్లు గుంటూరు నగర పాలక సంస్థ పెట్టినట్లుగా బోర్డు ఏర్పాటు చేశారు. దానికి టోల్ ఫ్రీ నెంబరు అంటూ ఒక ఫోన్ నెంబరు ఇచ్చారు. ఇది కాస్తా వైరల్ గా మారింది.

కరోనా మరణాల అంత్యక్రియల్లో కూడా ఈ బాదుడేందిరా? అన్న విస్మయానికి గురి కాక తప్పని పరిస్థితి. ఇంతకీ ఈ మొత్తం అంత్యక్రియలు చేసే వారికే.. అక్కడి సామాగ్రి.. శశ్మశానానికి తీసుకెళ్లటానికి వాడే అంబులెన్సులు వసూలు చేసే ఛార్జీల మోత మరో రేంజ్ లో ఉంటుందన్నది మర్చిపోకూడదు. ఏమైనా.. కరోనా కష్టకాలంలో ఇలాంటి బాదుడు ఏమాత్రం హర్షనీయం కాదు.
Tags:    

Similar News