గుడివాడ వర్సెస్ మాజీ మంత్రి...వైసీపీలో రచ్చ

Update: 2023-03-31 19:00 GMT
విశాఖ జిల్లాకు చెందిన యువ మంత్రి గుడివాడ అమరనాధ్ కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద మంచి పలుకుబడి ఉంది. ఆయనను జగన్ బాగా ప్రోత్సహిస్తారు. ప్రతిపక్షనంలో ఉన్నపుడు కూడా అమర్ కే జిల్లా బాధ్యతలు మొత్తం అప్పగించి ఆయన మాటే ఫైనల్ అని చెప్పేసిన ఔదార్యం హై కమాండ్ ది. గుడివాడ ఫ్యామిలీ రాజకీయ కుటుంబం. దాంతో పాటు బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేత.

దాంతో జగన్ ఆయన్ని ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన గుడివాడ అనకాపల్లి నుంచి రాజకీయాలు చేస్తున్నారు. ఆయన అనకాపల్లి నుంచి 2014లో ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఆయన 2019లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి జగన్ వేవ్ లో గెలిచారు. మరోసారి అక్కడ నుంచే పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.

అలాంటి గుడివాడకు అనకాపల్లి లో సొంత పార్టీలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని చెబుతారు. మాజీ మంత్రి అనకాపల్లి నుంచి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సొంత ఇలాకా అనకాపల్లి. 2019లో గుడివాడ గెలుపునకు దాడి ఎంతో కృషి చేశారు. అయితే ఇద్దరి మధ్య రాజకీయంగా చెడింది అంటారు.

దాడికి ఎమ్మెల్సీ పదవి రాకుండా గుడివాడ అడ్డుకున్నారని మాజీ మంత్రి వర్గీయులకు కోపంగా ఉందని చెబుతారు. ఈ నేపధ్యంలో గుడివాడకు టికెట్ ఇస్తే గెలవరు అని మాజీ మంత్రి వర్గం గట్టిగానే చెప్పేస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఈ మధ్య జరిగిన ఒక సంఘటన గుడివాడ వర్సెస్ మాజీ మంత్రి అన్నట్లుగా ఉన్న ప్రచ్చన్న  యుద్ధ వాతావరణాన్ని మరింతగా పెంచేసాయి అంటున్నారు.

అనకాపల్లిలో ప్రసిద్ధమైన ఆలయం శ్రీ నూకాలమ్మ వారి కోవెల. ఈ నెల 21న అమ్మవారి జాతర సందర్భంగా ఆలయానికి రావాలంటూ మంత్రికి ఆలయ కమిటీ నుంచి ఆహ్వానం లభించిందట. మంత్రి కూడా ఆ ఆహ్వానాన్ని మన్నించి అదే రోజు ఆలయాన్నికి సాయంత్రం వచ్చారట. అయితే మంత్రిని చాలా సేపు బయట ఆలయ అధికారులు వెయిట్ చేయించేశారుట.

సుమారుగా ఒక గంట పాటు అలా బయట గుడివాడ ఉండిపోయారుట. ఆ మీదట దర్శనం జరిగిందట. అయితే అమవారి కంటే తాను ఎక్కువ కాదు కదా అని మంత్రి సర్దిచెప్పుకుని నిరీక్షించారని అంటున్నారు. ఆ మీదటనే దర్శనం చేసుకున్నారు. కానీ ఆ తరువాతనే ఆయనకు ఒక విషయం తెలిసిందిట.

ఆలయంలో తనను గంట పాటు వెయిట్ చేయించడంవెనక మాజీ మంత్రి దాడి వీరభద్రరావు హస్తం ఉంది అని మ్యాటర్ ఒకటి చెవిన పడిందట. ఆలయ ఈవో మాజీ మంత్రి దాడి చెప్పినట్లుగా వింటున్నారని అందుకే తనను వెయిట్ చేయించారని మంత్రికు తెలియడంతో ఆయన మండిపోయారుట.

అందుకే ఈ విషయం మొత్తం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు చెపి మరీ  తక్షణం ఆలయ ఈవోను బదిలీ చేయించారుట. అయితే ఈ బదిలీ కక్ష సాధింపు చర్యగా ఉండకుండా వేర మరో అధికారిని కూడా బదిలీ చేయించారుట. మొత్తానికి చూస్తే మాజీ మంత్రి వర్సెస్ మంత్రి గుడివాడల మధ్య రాజకీయం తారస్థాయిలోకే వెళ్ళింది అని అంటున్నారు.
4

వచ్చే ఎన్నికల్లో తాను మళ్ళీ అనకాపల్లి నుంచే పోటీ చేస్తాను అని గుడివాడ చెబుతున్నారు. ఆయన పోటీకి దిగితే మాజీ మంత్రి వర్గం సహరించకపోగా ఓడించడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ వై నాట్ 175 అంటున్న వేళ ఇలా ఒకే పార్టీలో నాయకులు విభేదాలతో రచ్చ చేసుకుంటే అది వైసీఈనే దెబ్బ తీస్తుందని అంటున్నారు.         


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News