మెకానిక్ రూ.70 కోట్ల జీఎస్టీ ఎగవేశాడట!

Update: 2020-11-07 08:10 GMT
జీఎస్టీ అధికారుల నోటీసులు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒక సాదాసీదా మెకానిక్ కు రూ.70 కోట్ల జీఎస్టీ ఎగవేసినట్లుగా నోటీసులు ఇచ్చిన వైనం షాకింగ్ గా మారింది. ఒడిశాలోని కటక్ లో చోటు చేసుకున్న వైనం ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఈ నోటీసుల వెనుక సంస్థ తప్పుతో పాటు.. భారీ మోసం ఉందన్న మాట వినిపిస్తోంది. అదెలానంటే..

ఒడిశాకు చెందిన సుందర్ గఢ్ జిల్లాకు చెందిన సమీర్ జో ఒక సాదాసీదా మెకానిక్. తన పని తాను చేసుకుంటూ బతికే అతగాడు.. సరైన ఉపాధి అవకాశాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రవుర్కెలలోని ఒక పరిశ్రమలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఒక వ్యక్తి అతని గుర్తింపు పత్రాల్ని తీసుకెళ్లాడు. కొన్ని చెక్కులపై సంతకాల్ని చేయించుకున్నాడు.

ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఉన్న ఆ మెకానిక్ కు తాజాగా జీఎస్టీ నుంచి నోటీసులు అందాయి. రూ.70 కోట్ల జీఎస్టీని ఎగ్గొట్టిన దానికి సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. తన వద్ద ధ్రువ పత్రాల్ని తీసుకెళ్లిన వ్యక్తి కనిపించకపోవటం.. తాజాగా నోటీసులు రావటంతో తాను మోసపోయినట్లుగా ఆ వ్యక్తి అర్థం చేసుకున్నాడు.మెకానిక్ పేరుతో కంపెనీ తెరిచి.. పన్ను ఎగవేసి ఉండొచ్చన్న మాట అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మెకానిక్ గా బతికే తనకు కంపెనీ ఎక్కడిదని వాపోతున్నారు. ఈ ఉదంతంలో ఏం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News