అధికారులకు ఇష్టుడు అవుతున్న సీఎం జగన్!

Update: 2019-06-19 16:03 GMT
పలకరింపు తీరులో కానీ - మాట తీరులో కానీ.. ఇప్పటి వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నతాధికారుల నుంచి మంచి మార్కులే పడుతూ ఉన్నాయి. చంద్రబాబు హయాంలో కీలక పాత్రల్లో ఉండిన పలువురు అధికారులను బదిలీ చేసి తనకు కావాల్సిన టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది.

ఆ సంగతలా ఉంటే.. కొందరు కామన్ అధికారులు కూడా జగన్ పనితీరు విషయంలో చాలా సానుకూలంగా కనిపిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వర్కింగ్ అవర్స్ విషయంలో జగన్ మోహన్ రెడ్డి చాలా కూల్ గా ఉండటాన్ని వారు స్వాగతిస్తూ ఉన్నారని తెలుస్తోంది. చంద్రబాబు హయాంతో పోలిస్తే జగన్ మోహన్ రెడ్డి హయాం పని వాతావరణం చాలా ఈజీగా ఉందని వారు అంటున్నారని సమాచారం.

చంద్రబాబు నాయుడు అంటేనే సమీక్షలకు పెట్టింది పేరు. అటు పార్టీ వ్యవహారాల్లో అయినా, ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లో అయినా చంద్రబాబు నాయుడు సమీక్షలను నిర్వహించి - నిర్వహించి తన చుట్టూ ఉన్న వారిని హడలు కొడుతూ ఉంటారనే పేరుంది. ఆఖరికి ఇటీవల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు సమీక్షలు అంటూ సొంత పార్టీ కార్యకర్తలనే విసిగించారు. అలాంటిది ఆయన సీఎంగా ఉన్నతాధికారులతో ఎలా వ్యవహరించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు అలాంటి టార్చరే లేదని అధికారులు రిలీఫ్ ఫీల్ అవుతున్నారట. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉదయం ఎనిమిది, తొమ్మిదికి సెక్రటేరియట్ కు వెళ్తే.. ఇంటికి చేరుకునేది ఏ అర్ధరాత్రోనట. సమీక్షల పేరుతో అధికారులను చంద్రబాబు నాయుడు నిత్యం తన చుట్టూ కూర్చోబెట్టుకుని..అటు పని జరగనీయకుండా, ఇటు వారికి విరామమూ లేకుండా చేసేవారట. అలా సమీక్షలు నిర్వహిచండమే మంచి పాలకుడి సత్తా అని చంద్రబాబు నాయుడు అనుకునే వారేమో.

అయితే జగన్ మోహన్ రెడ్డితో మాత్రం వ్యవహారం కట్టె - కొట్టె. తెచ్చె.. అన్నట్టుగా ఉంటుందట. జగన్ కూడా ముఖ్యమంత్రిగా అనేక సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే సుదీర్ఘ సమీక్ష కూడా మూడు గంటల సేపు దాటదని.. ఉదయం ఎనిమిదన్నరకు పని మొదలుపెట్టి, మూడు గంటలకు ప్రభుత్వ కార్యకలాపాలను జగన్ పూర్తి చేస్తున్నారని సమాచారం. మరీ అవసరం అయితే తప్ప అధికారులను ఆ తర్వాత పిలిపించడం లేదట.

అత్యవసరం అయిన సందర్భాల్లో ఎలాగూ అర్దరాత్రి వరకూ సమీక్షలు - పనులు తప్పవు. మామూలుగా ఉన్నప్పుడు అలాంటి వర్క్ అవసరం లేదని జగన్ భావిస్తున్నారని సమాచారం. ఇలా స్మార్ట్ వర్క్ విషయంలో జగన్ అధికారులకు బాగా నచ్చేశారని టాక్!
Tags:    

Similar News