ఆర్టీసీ కార్మికులకు గవర్నర్ భరోసా..ఏం జరగనుంది?

Update: 2019-10-22 07:04 GMT
గడిచిన పదహారు రోజులుగా సాగుతున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంబంధించి ఇప్పుడో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ తమకు సరైన అండ లభించలేదన్న కొరతతో ఉన్న కార్మికులకు గవర్నర్ తమిళ సై రూపంలో ఒక భరోసా లభించింది. సమ్మె ఎంత కాలం చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదనటమే కాదు.. సమ్మెలో ఉన్న కార్మికులంతా సెల్ప్ డిస్మిస్ అయినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్న వేళలో.. ఆయన మనసు మార్చటానికి ఏం చేయాలన్న దానిపై కార్మికులు కిందా మీదా పడుతున్నారు.

తమతో చర్చలు జరిపేందుకు సైతం సిద్ధంగా లేని సీఎం కేసీఆర్ ను ఎలా ఆయన మనసు మార్చాలనుకుంటున్న వేళ.. కార్మికులకు గవర్నర్ రూపంలో పెద్ద అండ లభించినట్లుగా చెప్పక తప్పదు. చర్చలకు ఆహ్వానించటం.. అద్దె బస్సులను తీసుకునే విషయంలో ప్రభుత్వంతో తాను మాట్లాడతానని.. ఆర్టీసీ కార్మికులు భయపడొద్దంటూ గవర్నర్ తమిళ సై ఇచ్చిన భరోసా ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త టానిక్ లా పని చేస్తుందని చెప్పాలి.

తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని మాటను చెప్పటంతో పాటు.. కార్మికుల్లో ధైర్యం నింపాలని ఆర్టీసీ జేఏసీ నేతలకు ఆమె సూచన చేయటం చూస్తే.. తమకు గవర్నర్ ఉన్నారన్న భావన ఉద్యోగుల్లో కలిగేలా చేశారని చెప్పాలి. గవర్నర్ మాట ఇచ్చిన తర్వాత.. ప్రభుత్వం సైతం ఆమె మాటను.. సలహా.. సూచనల్ని పరిగణలోకి తీసుకోకుండా ఉండలేరు. రాష్ట్రంలో బీజేపీ మరింత చొచ్చుకుపోవాలని భావిస్తున్న వేళ.. అనుకోని రీతిలో వచ్చిన ఆర్టీసీ కార్మికుల సమ్మెను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ వర్గాలకు.. గవర్నర్ తాజా వ్యాఖ్యలు సంతోషాన్ని కలిగిస్తాయని చెప్పకతప్పదు.
Tags:    

Similar News