గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీ టూర్‌..బాబుపై రిపోర్ట్‌ కోస‌మేనా?

Update: 2018-04-24 04:37 GMT
ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ - కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ లతో గ‌వ‌ర్న‌ర్ భేటీ అవుతారని సమాచారం. రాష్ట్ర విభజన సమస్యలు - ఇతర అంశాలపై చర్చించే అవకాశముందని తెలిసింది. రెండురోజుల పాటు గవర్నర్ ఢిల్లీలోనే ఉంటారు. గురువారం ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు. అయితే మూడు రోజుల పాటు హస్తినలోనే ఉండే ఈ టూరు ఇంత స‌డ‌న్‌ గా పెట్టుకోవ‌డం ఏమిట‌నే చ‌ర్చ వినిపిస్తోంది. ఈ టూరులో ఏపీలోని ప‌రిణామాల‌పై నివేదిక ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తో పాటు పలువురు పెద్దలను కలవనున్న సంద‌ర్భంగా తెలుగురాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై కేంద్రానికి గవర్నర్ నరసింహన్ ఓ నివేదిక ఇవ్వనున్నారని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ఆదివారం అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గవర్నర్ కలవడానికి కారణం ఢిల్లీ పర్యటనే అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు రావ‌డం - ప్రధాని నరేంద్ర మోడీని చంద్ర‌బాబు ఏక‌వాక్యంతో టార్గెట్ చేసి విమర్శలు గుప్పించ‌డం, ఒక రోజు దీక్ష చేయ‌డం వంటి పరిణామాల నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ నరసింహన్ ఎలాంటి నివేదిక ఇస్తారన్నది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News