పాయసంలో సాంబార్ కలుపుకునేవాడంట

Update: 2015-12-18 05:26 GMT
దక్షిణాది వారికి సుపరిచితమైన సాంబార్.. పాయసం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వార్తాంశం అయ్యింది. ఒక ప్రముఖుడి నోట వచ్చిన పాయసం.. సాంబార్ మాట.. ఆ కాంబినేషన్ ఆసక్తికరంగా మారింది. రెండు భిన్న ధ్రువాలైన సాంబార్ ను.. పాయసాన్ని కలిసి తినటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. అలా తినటం తనకు అలవాటంటూ చాలామందిని ఆశ్చర్యానికి గురి చేశారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. ప్రవాస భారతీయుడైన ఆయన తన తాజా భారత పర్యటనలో ఢిల్లీ విద్యార్థులతో ముచ్చటించిన సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చాడు.

తనకు స్వీటు అస్సలు ఇష్టం ఉండదని.. తన ఇంట్లో పాయసం చేసి తినమనే వారని.. అలాంటప్పుడు దాన్ని సాంబార్ లో కలుపుకొని తిన్నట్లు చెప్పారు. నిజానికి ఏ మాత్రం సంబంధం లేని ఈ చిత్రమైన కాంబినేషన్ చెప్పిన సుందర్ పిచాయ్ ఆహారపు అలవాటు గురించి విన్నవారు ఎవరూ.. ఇప్పట్లో ఆయన్ను మర్చిపోలేరు. ఇక.. సుందర్ పిచాయ్ వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలకు వస్తే.. ఎవరి దగ్గరైనా ఒకట్రెండు స్మార్ట్ ఫోన్లు గ్యారెంటీ. మరి.. గూగుల్ సీఈవో లాంటి వ్యక్తి దగ్గర ఎన్ని ఫోన్లు ఉంటాయి?

ఈ ఆసక్తికర ప్రశ్నకు సుందర్ ఇచ్చిన సమాధానం.. 20 నుంచి 30 ఫోన్లట. గూగుల్ సీఈవో స్థాయిలో ఉన్న సుందర్ కు ప్లస్ టు (ఇంటర్) లో మార్కులు ఎన్ని వచ్చి ఉంటాయి? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వకున్నా.. ‘‘ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చేరటానికి మాత్రం సరిపోవు’’ అంటూ చెప్పేశారు. తాను తొలిసారి 1996లో మోటరోలా ఫోన్ కొన్నప్పటికీ.. స్మార్ట్ ఫోన్ కొన్నది మాత్రం 2006లో చెప్పాడు.
Tags:    

Similar News