పోలీస్ స్టేష‌న్ కు ఫైన్ వేసిన జీహెచ్ ఎంసీ!

Update: 2019-07-05 06:22 GMT
ఫైన్లు మీరే కాదు మేం కూడా వేయ‌గ‌ల‌మ‌న్న సందేశాన్ని ఇస్తూ ఒక‌లాంటి షాకిచ్చి వార్త‌ల్లోకి వ‌చ్చింది గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో పోలీస్ స్టేష‌న్ కు ఫైన్ వేసిన వైనం సంచ‌ల‌నంగా మారింది. ఇంత‌కీ ఏ త‌ప్పు చేశార‌ని పోలీస్ స్టేష‌న్ కు జీహెచ్ ఎంసీ అధికారులు ఫైన్ వేశార‌న్న విష‌యంలోకి వెళితే.. బోనాల సంద‌ర్భంగా వాల్ పోస్ట‌ర్ అంటించిన గోల్కొండ పోలీసుల‌కు స‌ర్కిల్ -13కు చెందిన డిప్యూటీ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ రూ.10వేల భారీ జ‌రిమానా విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఒక పోలీస్ స్టేష‌న్ కు జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్ ఫైన్ వేసిన తీరు హాట్ టాపిక్ గా మారింది. అనుమ‌తి లేని చోట వాల్ పోస్ట‌ర్లు అంటించారంటూ ఫైన్ వేయ‌టం పోలీసు శాఖ ఒకింత షాక్ కు గురైంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ పోస్ట‌ర్ లో డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి.. హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌ని కుమార్తో పాటు ప‌లువురు పోలీసు ఉన్న‌తాధికారుల ఫోటోలు ఉన్నాయి.

గోల్కొండ పోలీస్ స్టేష‌న్ కు జీహెచ్ ఎంసీ అధికారులు జ‌రిమానా వేసిన విష‌యం బ‌య‌ట‌కు రావ‌టంతో సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌భుత్వ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఉండాలే కానీ ఇలా ఫైన్లు వేసుకోవ‌టం సమంజ‌సం కాద‌న్న భావ‌న‌కు  ఉన్న‌తాధికారులు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార్ జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిశోర్ తో మాట్లాడారు. దీంతో..  చ‌లానా ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. స్వ‌ల్ప స‌మాచార లోపంతోనే జీహెచ్ ఎంసీ.. పోలీస్ విభాగం మ‌ధ్య వివాదం ఏర్ప‌డింద‌ని.. రెండు శాఖ‌ల బిగ్ బాస్ లు మాట్లాడుకోవ‌టంతో ఇష్యూ సెటిల్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. పోలీస్ స్టేష‌న్ కు జీహెచ్ ఎంసీ ఫైన్ పేరుతో షాకిచ్చింద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News