రోడ్లపైకి నీళ్లు వదిలే యజమానికి భారీగా ఫైన్ వేశారు

Update: 2020-09-30 09:30 GMT
కారణం ఏమైతేనేం.. తమ భవన సెల్లార్ లోకి వచ్చి చేరే వర్షపు నీటిని రోడ్ల మీదకు వదిలేసే అలవాటు తెలుగు రాష్ట్రాల్లో చాలా కామన్. ఇక.. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ఈ అలవాటు ఎంత ఎక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. అలాంటి అలవాటు ఉన్న వారు తక్షణం తమ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే.. అధికారులు వేసే భారీ ఫైన్లకు దిమ్మ తిరిగిపోవటం ఖాయం. తాజాగా అలాంటి ఫైన్ వేసి సంచలనంగా మారారు గ్రేటర్ అధికారులు.

గచ్చిబౌలిలోని ఒక నిర్మాణ సంస్థకు ట్రాఫిక్ పోలీసులు భారీ ఫైన్ వేసి షాకిచ్చారు. ఇంతకు వారు చేసిన తప్పు.. తమ సెల్లార్ లో నిలిచిన నీటిని రోడ్ల మీదకు వదలటమే. ఇంతకూ వారెవరు? అన్న విషయంలోకి వెళితే.. వాసవీ జీపీ ట్రెండ్స్ అనే భవనం నానాక్ రామ్ గూడ ఓఆర్ఆర్ సర్వీసులో రోడ్డులో ఉంది. హనుమాన్ టెంపుల్ కు దగ్గరగా ఉండే ఈ భవనంలో వర్షపు నీరు తరచూ నిలిచిపోతుంటుంది. దీంతో.. వారు ఆ నీటిని రోడ్ల మీదకు మోటారు సాయంతో రోడ్ల మీదకు విడిచేస్తుంటారు.

ఈ కారణంగా వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురి కావటమే కాదు..కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. నీటిని బయటకు విడిచిపెట్టటంతో సర్వీసు రోడ్డు మొత్తం బురదగా మారిపోతుంటుంది. దీంతో ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతుంటాయి. ఇదే విషయాన్ని భవన యజమానికి పలుమార్లు అధికారులు చెప్పారు. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు. తమ సెల్లార్ లో నిలిచిన నీటిని రోడ్ల మీదకు వదిలేయటం అలవాటుగా మార్చుకున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా అధికారులు సదరు భవన యజమానికి రూ.లక్ష ఫైన్ విధించారు. మున్సిపల్ అధికారుల ఫిర్యాదుతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ భారీ ఫైన్ విధించారు. దీంతో.. సదరు భవన యజమాని ఒక్కసారి షాక్ తిన్నట్లైంది. ఇదే విధానాన్ని మహానగరంలోని ఇతర చోట్ల కూడా అమలు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే..రోడ్ల మీదకు ఇష్టారాజ్యంగా నీళ్లను వదిలేసే వారందరికి కొత్త తిప్పలు మీద పడినట్లే.
Tags:    

Similar News