15 రోజులైంది; కేటీఆరే స్వయంగా చెప్పినా..

Update: 2016-06-28 05:17 GMT
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవర్ ఫుల్ నేత ఎవరన్న వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెబుతారు. కానీ.. కొందరు మాత్రం అందుకు భిన్నంగా కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ అని చెబుతారు. అదెంత నిజమన్న విషయానికి వస్తే.. టెక్నికల్ గా ఇప్పటికిప్పుడు కేటీఆర్ అత్యంత శక్తివంతమైన నేత కానప్పటికీ.. లాజిక్ గా మాత్రం ఆయనే పవర్ ఫుల్ నేత అని చెప్పక తప్పదు. ఎందుకంటే.. కేసీఆర్ కంటే కేటీఆర్ పవర్ ఫుల్ అని ఒప్పుకోవటానికి చాలా మందికి ఇష్టం లేకున్నా.. కేసీఆర్ వారసుడు మాత్రం ఆయనేనని ఒప్పుకోవటానికి మాత్రం ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండవు. మరి.. అలాంటి కేటీఆర్ నోటి నుంచి ఏదైనా మాట వస్తే ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్న డౌట్ అస్సలు అక్కర్లేదు.

ఎందుకంటే.. సీఎం కేసీఆర్ స్థాయిలో చక్రం తిప్పే కేటీఆర్ తలుచుకుంటే ఎవరి పరిస్థితి అయినా ఎలా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. అంతటి పవర్ ఫుల్ నేత మాటను అధికారులు లైట్ తీసుకుంటున్నారా అంటే అవుననే చెప్పక తప్పదు. దాదాపు 15 రోజుల క్రితం (ఇంకా సరిగ్గా చెప్పాలంటే జూన్ 13న) సిటీలోని ప్రధానమైన శ్రీనగర్ కాలనీలోని రోడ్లను కేటీఆర్ స్వయంగా పరిశీలించారు. అక్కడి దుస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జీహెచ్ ఎంసీ అధికారులతో భేటీ అయ్యారు. హైదరాబాద్ రోడ్ల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో కాంట్రాక్టర్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇన్ని పరిణామాల నేపథ్యంలో అధికారులు ఉరుకులు.. పరుగులు తీసి శ్రీనగర్ కాలనీ రూపురేఖలు మార్చేస్తారని.. మీడియాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండటమే కాదు.. కేటీఆర్ దెబ్బకు దశ తిరిగిన శ్రీనగర్ కాలనీ తరహా వార్తలు రావటం ఖాయమని చాలామంది భావించారు. మరి.. కేటీఆర్ ఆకస్మిక పర్యటన పూర్తి అయి దాదాపు 15 రోజులైన వేళ శ్రీనగర్ కాలనీ ఎలా ఉందన్న విషయాన్ని చూస్తే.. షాకింగ్ గా అనిపించక మానదు.

ఎందుకంటే.. రెండు వారాల క్రితం నాటి కంటే దారుణ పరిస్థితులు శ్రీనగర్ కాలనీలో చోటు చేసుకోవటం గమనార్హం. రోడ్లు బాగుపడటం తర్వాత.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. కనీసం నడవటానికి సైతం వీల్లేని పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాలనీ మొత్తం బురద.. వర్షపు నీరు.. డ్రైనేజీ నీటితో నిండి కంపు కొట్టే పరిస్థితి. హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తామని చెప్పే కేటీఆరే స్వయంగా వచ్చి శ్రీనగర్ కాలనీ రోడ్ల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసినా.. పరిస్థితులో మార్పు రాలేదంటే..? కేటీఆర్ పవర్ ఫుల్ కాదా..?
Tags:    

Similar News