కెప్టెన్ బాబా దారుణాలు.. మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు

మహారాష్ట్రలో జ్యోతిష్యం పేరుతో మహిళలను వంచించిన దొంగబాబా లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.;

Update: 2026-04-04 07:38 GMT

మహారాష్ట్రలో జ్యోతిష్యం పేరుతో మహిళలను వంచించిన దొంగబాబా లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సుమారు 150 మంది మహిళలను వంచించాడని కెప్టెన్ బాబాగా పేరు తెచ్చుకున్న అశోక్ రావత్ పై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ వ్యవహారం ఒక్క మహారాష్ట్రలోనే కాకుండా సోషల్ మీడియాను ఊపేస్తోంది. నేవీలో కెప్టెన్ గా పనిచేశానని చెప్పుకుని, జ్యోతిష్యం పేరుతో భక్తులను మోసం చేసిన అశోక్ రావత్ లీలలు ఆశ్చర్యపరుస్తున్నాయి.

సంతానం కలగలేదని తన వద్దకు వచ్చే మహిళలకు ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చేవాడని, ఆ తర్వాత వారిపై అత్యాచారం చేసేవాడని అశోక్ రావత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ఆయనపై 8 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాధితులు ఫోన్లలో ఫిర్యాదులు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఒక కేసులో అశోక్ రావత్ ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిస్తే 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం జైలులో ఉన్న అతడిపై వరుస కేసులు నమోదు అవుతుండటంతో పోలీసులు ఒక్కో కేసు నమోదు చేస్తున్నారు.

మహారాష్ట్రలో కెప్టెన్ స్వామిగా పేరు గడించిన అశోక్ రావత్ అక్రమాలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఆయనతో ఉన్న సంబంధాల కారణంగా రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలీ చకాన్ కర్ తన పదవిని వదులుకున్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నేతలు, అధికారులు కూడా ఆయనతో సంబంధాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం సంచలనం రేపుతోంది. భక్తులను వంచించి మోసం చేసిన అశోక్ కరాత్ భారీగా ఆస్తులు పోగేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తన అక్రమ సొమ్మును దాచేందుకు రెండు సహకర పరపతి సంఘాలలో బినామీ పేర్లతో 130 అకౌంట్లు ఉన్నట్లు చెబుతున్నారు.

కాగా, అశోక్ కారత్ తోపాటు ఆయన భార్య కల్పనపైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా అహల్యానగర్ జిల్లాలో నమోదైన కేసులో అశోక్ కారత్ పేరటి దాదాపు 1500 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు బయటపడంది. కొంత డబ్బు విదేశాల్లోనూ పెట్టుబడి పెట్టాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు చెబుతున్నారు. అశోక్ కారత్ భార్య కల్పన ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు ఆమె కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఆమె పట్టుబడితే మరిన్ని ఆస్తుల సమాచారం బయటపడొచ్చని అంటున్నారు.

నిందితుడు అశోక్ కారత్ పై ఫిర్యాదులు వెల్లువలా వచ్చిపడుతుండటంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. నిందితుడి కార్యాలయం నుంచి పోలీసులు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో రిమోట్ కంట్రోల్ తో నడిచే ఓ పాము కూడా పోలీసులు స్వాధీనం చేసకున్నారని అంటున్నారు. ఈ బొమ్మ పామును ఉపయోగించి అశోక్ కారాత్ భక్తులను మోసం చేసేవాడని చెబుతున్నారు.

అదేవిధంగా జ్యోతిష్యం పేరుతో రకరకాల పూజలు చేయాలని అశోక్ కారాత్ భక్తులను వంచించాడని ఫిర్యాదులు చేస్తున్నారు. పనికిరాని చింత గింజలను మంత్రించిన రాళ్లు అంటూ కిలోకు లక్ష వసూలు చేసేవాడని, మంత్రించిన తేనె అని చెప్పి కిలో రూ.9 లక్షలకు అంటగట్టేవాడని భక్తులు చెబుతున్నారు. దాదాపు 150 మంది మహిళలపై అత్యాచారం చేసిన అశోక్ కారత్ పై అనుమానంతో ఆయన వద్ద సహాయకుడిగా పనిచేసిన వ్యక్తి రహస్యంగా కెమెరా అమర్చి నిందితుడి బండారం బయటపెట్టాడు. ఆ వీడియో రికార్డులే ఇప్పుడు నిందితుడి దారుణాలకు కీలక ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వ పునాదులను ఊపేస్తున్నాయి.

Tags:    

Similar News