ఆప్ Vs రాఘవ్ చద్దా.. ఎంతవరకు వెళ్తుంది?

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుడిగా ఎదిగిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా వ్యవహారం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2026-04-04 07:39 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుడిగా ఎదిగిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా వ్యవహారం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురైన రాఘవ్ చద్దాను రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించారు. ఆ స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ ను ఆప్ హైకమాండ్ నియమించింది. ఇక ఈ వ్యవహారంపై రాఘవ్ చద్దా ఘాటుగా స్పందించారు. అధిష్టానంతో మాటల యుద్ధానికి సిద్ధమైన రాఘవ్ చద్దా తన గళాన్ని అణచివేయగలరేమో కానీ, తనను ఓడించలేరంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

తనను ఓడించలేరంటూ ఎంపీ రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలపై ఆప్ తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎంపీ రాఘవ్ చద్దా భయపడుతున్నారని ఆప్ వ్యాఖ్యానించింది. అయితే పార్లమెంటులో ప్రజాసమస్యలు లేవనెత్తడం నేరమా? దానివల్ల పార్టీకి ఏం నష్టమో అర్థం కావడం లేదు. నన్ను మాట్లాడనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ? ప్రశ్నిస్తూ రాఘవ్ చద్దా ఓ వీడియో విడుదల చేశారు. ఇది ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ డిబేట్ కు తెరతీసింది.

ఒకప్పుడు ఆప్ అధినేత కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడిగా రాఘవ్ చద్దా గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడైన ‘బ్లూ-ఐడ్ బాయ్’గా చద్దా గుర్తింపు పొందారు. 2012లో పార్టీ ఆవిర్భావం నుండి కేజ్రీవాల్‌తో కలిసి పనిచేశారు. పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సాధించిన చారిత్రాత్మక విజయానికి ఆయనే ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. అతి పిన్న వయస్కుడైన రాజ్యసభ ఎంపీగా, జాతీయ స్థాయిలో పార్టీ వాణిని బలంగా వినిపించే జాతీయ ప్రతినిధిగా ఉండేవారు. ఇక విపక్షాల 'ఇండియా' (INDIA) కూటమి చర్చల్లో కేజ్రీవాల్ పక్కన ఉండి సీట్ల సర్దుబాటు వంటి కీలక వ్యవహారాలను చక్కబెట్టారు.

పార్టీలో ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాఘవ్ చద్దాను ఆకస్మికంగా పక్కన పెడుతూ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది. రాఘవ్ చద్దాను అధిష్టానం దూరం పెట్టడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నారనే అనుమానంతో ఆప్ అధిష్టానం ఎంపీ రాఘవ్ చద్దాను పక్కన పెడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. చద్దా బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ముంబై ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలను రాఘవ్ చద్దా ప్రశంసించడం ఆప్ నాయకత్వంలో అనుమానాలను పెంచాయని అంటున్నారు.

ఇదే సమయంలో పంజాబ్ ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన అతిగా జోక్యం చేసుకుంటున్నారని సీఎం భగవంత్ మాన్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు పార్లమెంటులో పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ రాఘవ్ చద్దాపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. విపక్షాలు వాకౌట్ చేసినప్పుడు ఆయన పాల్గొనకపోవడం, పార్టీ ప్రాధాన్యం కాని అంశాలపై రాఘవ్ చద్దా మాట్లాడుతుండటం అధిష్టానానికి నచ్చలేదని అంటున్నారు.

ఈ కారణంగానే రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర లీడర్ పదవి నుంచి తప్పించడంతోపాటు సభలో పార్టీ తరఫున మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని రాజ్యసభ సెక్రటేరియట్ కు లేఖ రాయడం కలకలం రేపుతోంది. అయితే ఈ పరిణామాలను ఆప్ వ్యతిరేకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పార్టీలో ఎదుగుతున్న యువ నాయకులను కేజ్రీవాల్ సహించలేకపోతున్నారని, గతంలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ తరహాలోనే చద్దాను కూడా బయటకు పంపే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు చేస్తున్నారు. కాగా, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన లేని వ్యక్తికి ప్రాధాన్యత తగ్గించడం సహజమేనని ఆప్ మద్దతుదారులు వాదిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ రాఘవ్ చద్దా చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. చద్దా త్వరలోనే బీజేపీలో చేరతారా? లేదా పార్టీలోనే ఉండి తిరుగుబాటు చేస్తారా? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. రాఘవ్ చద్దా వంటి నాయకుడిని దూరం చేసుకోవడం ఆమ్ ఆద్మీ పార్టీకి మంచిదా? కాదా? అన్న అంశంపైనా చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా రాబోయే పంజాబ్ ఎన్నికలలో ఈ ఉదంతం ఎటు దారితీస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News