సెగలు పుట్టిస్తోన్న ఇంధన ధరలు..మన పెట్రోల్ మళ్లీ మనకే స్మగ్లింగ్‌!

Update: 2021-02-23 12:19 GMT
దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న పెట్రో ధరలపై ఆగ్రహావేశాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల్లో లీటర్ పెట్రోలు ధర వంద రూపాయలు దాటిపోయింది. ఇక ఈ రోజు దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలుపై 36 పైసల వరకు, డీజిల్ పై 38 పైసల వరకూ ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ ఉదయం ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 90.93కు చేరగా, డీజిల్ ధర రూ. 81.32కు పెరిగింది.

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు ఎడా పెడా పన్నులు బాదేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు అక్కడ పెరిగినప్పుడు దేశీయంగా తగ్గించకపోవడంతో పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలే కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్ధితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై కనికరం చూపేందుకు నిరాకరిస్తున్నాయి. పెట్రో ధరల పాపాన్ని అంతర్జాతీయ పరిస్ధితులపై నెట్టేసి హాయిగా కాలం గడిపేస్తున్నాయి. దీంతో సామాన్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినా వెనక్కి తగ్గేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా లేవు.

అసలే పెట్రో ధరల మంటతో సగటు జనానికి చుక్కలు కనిపిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం విదేశాలకు చమురు ఉత్పత్తుల ఎగుమతులు మాత్రం ఆపడం లేదు. దీంతో పొరుగున ఉన్న నేపాల్‌కూ, అక్కడి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంకకూ ఎగుమతులు యథావిధిగా సాగిపోతున్నాయి. మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్న పెట్రో, గ్యాసోలిన్‌ ఉత్పత్తులను అక్కడ స్ధానిక పన్నులు తక్కువగా ఉండటంతో తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు.

ఇదే అదనుగా అక్కడి అక్రమార్కులు రంగంలోకి దిగి వాటిని తక్కువ ధరకు కొనుక్కుని భారత్‌కు స్మగ్లింగ్‌ చేయడం మొదలుపెట్టేశారు. ఇలా నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి మన దేశంలోకి అవే ఉత్పత్తులు స్మగ్లింగ్ ‌ అయిపోతున్నాయి. ఇలా భారత్‌ ఎగుమతి చేస్తున్న చమురు ఉత్పత్తులను తిరిగి దేశంలోకి అక్రమ రవాణా చేస్తున్న వారు దేశంలోకి వచ్చే రోడ్డు మార్గాల్లో రోడ్లపైనే వీటిని విక్రయించేస్తున్నారు. భారత్ ‌లో ఎక్కువ ధరకు పెట్రోల్‌, డీజిల్ కొనడం ఎందుకని వాహనదారులు కూడా వీరి వద్దే వాటిని కొనుగోలు చేసేస్తున్నారు. దీని వల్ల సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్‌ బంకుల్లో భారీగా అమ్మకాలు పడిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సరిహద్దుల్లోకి వచ్చే రోడ్లపైన కూడా నిఘా పెంచాలని నిర్ణయించారు.
Tags:    

Similar News