పెట్రోల్ - డీజిల్ పై బాదుడు..ఈ సారి భారీ వడ్డనేనట!

Update: 2020-03-23 17:30 GMT
అసలే కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్న వేళ... కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కఠినాతి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. స్వీయ నిర్బంధం ఒక్కటే కరోనా నుంచి రక్షణ అంటూ నిషేదాజ్ఝలు విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం... ఉరుము లేని పిడుగులా పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచేందుకు కసరత్తును పూర్తి చేసినట్లుగా వినిపిస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇంధన విక్రయాలపై ఎక్సైజ్ సుంకం పరిమితిని భారీగా పెంచే దిశగా ఇప్పటికే ఫైనాన్స్ బిల్లుకు సవరణలు కేంద్రం చేస్తోందట. ఈ సవరణలకు పార్లమెంటులోని దిగువ సభ లోక్ సభ సోమవారం ఆమోద ముద్ర కూడా వేసిందట.  కరోనా నేపథ్యంలో దీనిపై ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం లభించిందట.

ఈ బిల్లు అమలులోకి వస్తే... ఒకేసారి పెట్రోల్ తో పాటు డీజిల్ పైనా భారీ వడ్డనలు అమలులోకి వస్తాయట. పెట్రోల్ పై టీటరుకు హీనపక్షం రూ.10 - డీజిల్ పై లీటరుకు రూ.4 మేర రేట్లు పెరుగుతాయట. ఈ హీనపక్షం కాకుండా అత్యధికంగా పెట్రోల్ పై లీటరుకు రూ.18 - డీజిల్ పై లీటరుకు రూ.12 దాకా కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వార్తలు నిజంగానే కలవరపెడుతున్నాయని చెప్పాలి. అసలే కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటున్న తరుణంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఇంధన ధరలు కూడా భారీగా పెరిగితే జనం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. చూద్దాం.. మరి కరోనా ఆంక్షలు సడలించే దాకా అయినా కేంద్రం ఇంధన ధరల పెంపును వాయిదా వేస్తుందో. లేదంటే ఇప్పుడే ధరలను పెంచేస్తుందో?


Tags:    

Similar News