ముద్దుబిడ్డ మరణం..పది పరిణామాలు

Update: 2015-07-27 19:05 GMT
భారతజాతి తన ముద్దుబిడ్డను కోల్పోయిది. 130కోట్ల మంది పైచిలుకు ప్రజలున్నా.. దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదొక్క అబ్దుల్ కలాం మాత్రమే. మిగిలిన వారెంత మంది ఉన్నా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ.. కలాం విషయంలో ఎవరూ ఏమీ అనరు. ఎందుకంటే.. అందరూ ఆయనకు అభిమానులే.

అలాంటి కలాం వంద కోట్లకు పైచిలుకు ప్రజల్ని ఒంటరిని చేసి వెళ్లిపోయారు. ఈ ఊహించని మహా విషాదం నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే..

1.        శాస్త్రవేత్తగా.. పరిపాలకుడిగా కలాం మహోన్నతమైన సేవల్ని అందించారని రాష్ట్రపతి ప్రణబ్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అబ్దుల్ కలాం ఎప్పుడూ ప్రజల రాష్ట్రపతిగా ఉండిపోతారని ఆయన వ్యాఖ్యానించారు.

2.        కలాం మరణం పట్ల ప్రధాని మోడీ నోట మాట రాని వ్యక్తిగా మారారు. తన గొంతు మూగబోయిందని.. ఎలా మాట్లాడాలో.. ఎలా స్పందించాలో తెలీటం లేదని చెప్పిన ఆయన.. దేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయిందని గద్గద స్వరంతో పేర్కొన్నారు. దేశం ఒక స్ఫూర్తిదాతను కోల్పోయిందని.. ఆయన మృతికి 7రోజులు సంతాప దినాలు ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు.

3.        కలాం మరణం పట్ల దేశం యావత్తు కన్నీటి ధార కారుస్తోంది. వార్తా సంస్థలు మొదలు.. సోషల్ మీడియా మొత్తం.. తమ స్ఫూర్తిదాత మరణాన్ని తట్టుకోలేకపోతున్న పరిస్థితి. నిమిషాల వ్యవధిలోనే కలాం ఇక లేరన్న వార్త దావనంలా పాకిపోయింది. ప్రముఖులు మొదలు.. సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడే వారే.

4.        అనుక్షణం విద్యార్థులతో గడపాలని తహతహలాడే కలాం.. తన చివరి క్షణాల్లోనూ విద్యార్థులతో మాట్లాడుతూ అస్వస్థతకు గురి కావటం గమనార్హం. కాసేపటికే ఆయన తుది శ్వాస విడిచారు. షిల్లాంగ్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో లవబుల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశంపై ప్రసంగించటానికి  ఆయన వెళ్లారు. ఆయన తన ప్రయాణానికి ముందు.. తాను షిల్లాంగ్ వెళుతున్నట్లుగా ట్వీట్ ఇచ్చారు. అదే ఆయన చివరి ట్వీట్.

5.        కలాం మరణంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి బాధ అంతా ఇంతా కాదు. ఎందుకంటే.. ఆగస్టు 17న తమ సంస్థ అయిన స్వర్ణభారతి ట్రస్టు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాలని అబ్దుల్ కలాంను కోరానని.. ఇందుకోసం మధ్యాహ్నమే తాను మాట్లాడానని.. మరోసారి ఆయన అపాయింట్ మెంట్ ఖరారు చేసుకుందామనే లోపు.. ఆయన మరణ వార్త వినాల్సి రావటం అత్యంత బాధకరమని వ్యాఖ్యానించారు.

6.        కలాం ఇక లేరన్న మాట వినటానికి కూడా కష్టంగా ఉందని.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేనట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.
4

7.        కలాం వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయనకు ముగ్గురు అమ్మలంటే తనకు చాలా ఇష్టమని పదే పదే ప్రస్తావించారు. వారిలో ఒకరు తన జన్మనిచ్చిన తల్లి  ఆశి అమ్మ.. సంగీత సరస్వతిగా కీర్తించే సుబ్బులక్ష్మి.. మదర్ థెరిస్సా అంటూ ఇష్టమని.. వారు ముగ్గురు తానెంతో అభిమానించే అమ్మలుగా చెప్పుకునేవారు.

8.        కలాంది నిరుపేద కుటుంబం. అందులోకి ఉమ్మడి కుటుంబం. ఫ్యామిలీలో పిల్లు ఎందరున్నా.. చదువుకుంటూ.. పని చేస్తున్న కలాంకే వారి అమ్మ ఎక్కువగా తిండి పెట్టేవారట.

9.        తక్కువ ధరకే అందుబాటులో ఉండే కరొనరీ స్టంట్ ను కనుగొన్న అబ్దుల్ కలాం.. చివరకు మాయదారి గుండె నొప్పితో ప్రాణాలు వదలటం ఏ మాత్రం జీర్ణం చేసుకోలేని అంశం. డాక్టర్ సోమయాజితో కలిసి ఆయనీ స్టంట్ తయారు చేసారు . అప్పటివరకూ డబ్బున్నోళ్లకు మాత్రమే సాధ్యమైన స్టంట్ కొనుగోలు.. కలాం పుణ్యమా అని సామాన్యులు సైతం కొనుగోలు చేసేంత తక్కువ ధరకు దాన్ని రూపొందించారు. అలా ఎంతోమంది పేదల్ని రక్షించిన కలామ్.. చివరకు అదే గుండెనొప్పితో మరణించటం అత్యంత విషాదం కలిగించే అంశం.

10.     పిల్లల్ని అమితంగా ఇష్టపడే కలాం.. చివరి నిమిషం వరకూ వారి మధ్యనే గడపటం.. తీవ్ర అస్వస్థతకు గురి కావటం.. ఆయన్ను ఆసుపత్రికి తరలించే ముందు వరకూ విద్యార్థులతో గడపటం మాజీ రాష్ట్రపతి కలాంకే దక్కింది. దేశవ్యాప్తంగా అన్ని నగరాలు.. పట్టణాల్లోని పాఠశాలల్లో ఆయన ప్రసంగించారని చెప్పొచ్చు.
Tags:    

Similar News