కశ్మీర్ పెద్దాయన మాటల్ని విన్నారా? అందరికి శ్రీరాముడు దేవుడే

Update: 2023-03-24 12:00 GMT
అదే పనిగా నోటికి పని చెబుతూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉండేది భారత్ లో అయినా.. పాకిస్తాన్ మీద పిసరంత ప్రేమను ప్రదర్శించే ఆయనకు ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయన మీద.. ఆయన మాట మీదా ప్రభావాన్ని చూపించాయా? అంటే అవునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

శ్రీరాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదని.. ఆయన్ను విశ్వసించే వారందరికి దేవుడే అంటూ ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. అధికారం కోసం బీజేపీ రాముడిని ఉపయోగించుకుంటుందని.. కానీ ఆయన వారికే దేవుడు కాదన్నారు. తాజాగా కశ్మీర్ లో మాట్లాడిన ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కశ్మీర్ పెద్దాయనగా పిలుచుకునే ఫరూక్ అబ్దుల్లా నోటి నుంచి ఈ తరహా మాటలు రావటం ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు.

ముస్లింలు.. క్రిస్టియన్లు.. అమెరికన్లు.. రష్యన్లు.. ఇలా ఎవరైతే రాముడ్ని విశ్వసిస్తారో వారికి ఆయన దేవుడే. తామే రాముడి భక్తులమని చెప్పుకునే వారికి నిజంగా ఆయన మీద ప్రేమ ఉండదు. అధికారం కోసం అలాంటి మాటలు చెబుతుంటారంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి.. ఫరూక్ నోటి నుంచి వచ్చిన శ్రీరాముడి మాటలకు బీజేపీ వర్గాలు ఏరీతిలో రియాక్టు అవుతాయో చూడాలి. మొత్తానికి మోడీ పుణ్యమా అని.. ఫరూక్ లాంటి వారి నోటి నుంచి సైతం శ్రీరాముడి మాట రావటం.. ఆయన అందరికి దేవుడన్న విషయాన్ని మీడియాతో చెప్పటం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి శ్రీరాముడ్ని అందరి దేవుడ్ని చేసిన ఫరూక్ వ్యాఖ్యలపై బీజేపీ రియాక్షన్ ఏమిటో చూడాలి.

Similar News