భార‌త్ ఇమేజ్ ను ఫారిన్ టూర్ల‌తో పెంచేశాడ‌ట‌!

Update: 2019-04-25 05:11 GMT
గొప్ప‌లు చెప్పుకోవ‌టం త‌ప్పు కాదు కానీ.. మోడీ మాష్టారి మాదిరి గొప్ప‌లంటే మాత్రం భ‌రించ‌టం క‌ష్ట‌మే. మోడీని కీర్తించే వారికి.. ఆయ‌న్ను అభిమానించే వారికి  ఆయ‌న మాట‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోపోవ‌టం క‌నిపిస్తుంది. ఏదైనా త‌ప్పును చూపిస్తే.. కాంగ్రెస్ హ‌యాంలో అలా జ‌ర‌గ‌లేదా? అంటూ ప్ర‌శ్నిస్తుంటారు. కాంగ్రెస్ కు చేత‌కాలేద‌నే క‌దా.. మోడీని ప్ర‌ధాన‌మంత్రిని చేసుకుంది. త‌ప్పు జ‌రిగినందుకే మోడీకి అవ‌కాశం వ‌చ్చింద‌న్న విష‌యాన్ని వ‌దిలేసి.. మోడీ మీద ఈగ వాల‌కుండా కాప‌లా కాసే ప‌రిస్థితి అంత‌కంత‌కూ పెరుగుతోంది.

త‌న‌కు ద‌న్నుగా నిలిచేవారి పుణ్య‌మా అని.. మోడీ మాష్టారి మాట‌లు ఈ మ‌ధ్య‌న కోట‌లు దాటుతున్నాయి. తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటున్న ఆయ‌న‌.. ప్ర‌ధాని హోదాలో మాట్లాడుతున్న మాట‌లు ఆశ్చ‌ర్యానికి గురి చేసేలా మారుతున్నాయి.

దేశ ప్ర‌ధానిగా త‌ర‌చూ విదేశాల‌కు వెళ్లే మోడీ.. అస‌లు దేశంలో ఉన్నారా?  విదేశాల్లో ఉంటున్నారా? అన్న భావ‌న ఒక ద‌శ‌లో క‌లిగింది. ఇటీవ‌ల కాలంలో విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్ని భారీగా త‌గ్గించేసిన మోడీ.. ఎన్నిక‌ల వ్యూహాల మీద‌నే ప్ర‌త్యేక దృష్టి పెట్టార‌ని చెప్పాలి. ఫారిన్ టూర్ల‌కు అదే ప‌నిగా వెళ‌తారంటూ విప‌క్షాలు చేసే విమ‌ర్శ‌ల్ని తిప్పి కొట్టే క్ర‌మంలో ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన వ్యాఖ్య‌లు వింటే అవాక్కు అవ్వాల్సిందే.

త‌న ఫారిన్ టూర్ల కార‌ణంగా భార‌త‌దేశ శ‌క్తి సామ‌ర్థ్యాల్ని విదేశాలు గుర్తించిన‌ట్లుగా పేర్కొన్నారు. ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలో దేశంలో కంటే.. విదేశాల్లో ఎక్కువ‌గా ప‌ర్య‌టించార‌న్న ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న బ‌దులిచ్చే క్ర‌మంలో ఈ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. మోడీ మాట‌లు వింటే.. ఆయ‌న కానీ దేశ ప్ర‌ధాని కాకుంటే.. భార‌త్ ఇమేజ్ ఏమైపోయి ఉండేదో? ఇన్నాళ్లుగా రాని కొత్త ఇమేజ్.. ఇప్పుడేం వ‌చ్చిందో కాస్త వివ‌రించి చెబితే బాగుంటుంది మోడీజీ?
Tags:    

Similar News