కరోనా వేళ.. గుండెపోటుతో వెళ్లిపోయిన వంగపండు

Update: 2020-08-04 05:15 GMT
పాడు కరోనాను ఎంత అనుకున్నా.. మరెంత తిట్టుకున్నా తక్కువే. నెలల తరబడి సాగుతున్న కరోనా.. రానున్న మరికొన్ని నెలలు కొనసాగనుంది. ఇలాంటివేళ.. చోటుచేసుకుంటున్న ప్రముఖుల మరణాలు ఇప్పుడు ఆవేదగా మారాయి. తాము అమితంగా అభిమానించే వారిని కడసారి చూసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిని పలువురు తిట్టుకుంటున్నారు. గడిచిన కొద్ది నెలలుగా ఎంతోమంది ప్రముఖులు శాశ్విత నిద్రలోకి జారి పోయారు. వారంతా చరిత్రగా మిగిలారు.

తాజాగా ప్రముఖ వాగ్గేయకారుడు.. తన పాటతో పేద ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు ఇక లేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. ఈ రోజు ఉదయం తన ఇంట్లో (విజయనగరం జిల్లా పార్వతీపురం) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లుగా కటుంబ సభ్యులు చెబుతున్నారు.

77 ఏళ్ల వంగపండు.. మూడు దశాబ్దాలుగా జానపద పాటలు రచించారు. తన పాటలతో పేద..గిరిజన.. సామాన్య ప్రజల్ని చైతన్యపరిచారు. ఏం పిల్లడో ఎల్దమొస్తవ అనే పాటతో తెలుగువారిని ఉర్రూతలూగించిన ఆయన.. 1943లో జన్మించారు. 1972లో జననాట్యమండలిని స్థాపించిన ఈ విప్లవ కవి మరణం.. పలువురిని విషాదంలోకి నెడుతోంది. వందలాది జానపదాల్ని వంగపండు గజ్జెకట్టారు. 2017లో కళారత్న పురస్కారాన్ని అందుకున్న ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

వంగపండు మరణంపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. ఉత్తరాంధ్ర జానపద శిఖరం.. ప్రజాకవి.. కళాకారుడు వంగపండు మృతి  తీరని లోటు.. ఈ తెల్లవారుజామున ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారన్న వార్త నన్ను దిగ్ర్భాంతికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని తెలియజేశారు. మరోవైపు ప్రజా కవి గద్దర్ వంగపండు మరణంపై స్సందించారు. వంగపండు పాట కాదు ప్రజల గుండె చప్పుడుగా అభివర్ణించారు. అక్షరం ఉన్నంతవరకు వంగపండు ఉంటారన్న ఆయన.. పది భాషల్లోకి ఆయన పాటల్ని అనువదించారన్నారు.
Tags:    

Similar News