ఉచ్చు బిగుస్తోందా?

Update: 2021-09-19 07:45 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇప్పుడిప్పుడే జోరు పెంచుతున్న మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు తెలుగు దేశం పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌కు బ్రేక్ ప‌డ‌నుందా? ఆయ‌న మెడ‌కు ఉచ్చు బిగుస్తోందా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఏపీ ఫైబ‌ర్ నెట్ కుంభ‌కోణమే అందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.  టీడీపీ హ‌యాంలో ఫైబ‌ర్‌నెట్ కుంభ‌కోణం చేశార‌ని వైసీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడీ కుంభ‌కోణంలో పాత్ర ఉన్న‌వాళ్ల‌ను అరెస్ట్ చేయ‌డం మొద‌లైంది. ఆ కుంభ‌కోణంపై ఆరోప‌ణ‌లు చేస్తున్న వైసీపీ నేత‌ల‌కు సాక్ష్యాలు చూపించండి అంటూ స‌వాల్ విసిరిన లోకేష్ ఇప్పుడు సైలెంట్ కావాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో ఫైబ‌ర్ నెట్ ప్రోగ్రామ్‌తో టీడీపీ నేత‌లు అక్ర‌మాల‌కు తెర‌తీశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అప్ప‌ట్లో ఐటీ మంత్రిగా లోకేష్ ఉండ‌డంతో ఆయ‌న క‌నుసన్న‌ల్లోనే ఈ కుంభ‌కోణం జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.  గ‌త తెలుగు దేశం ప్ర‌భుత్వం ఫైబ‌ర్ నెట్ ప్రాజెక్టును అమ‌ల్లోకి తెచ్చింది. అయితే అప్పుడు టెరాసాఫ్ట్ కంపెనీకి అర్హ‌త లేకున్నా సెట్ టాప్ బాక్స్‌లు స‌మ‌కూర్చేందుకు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా టెండ‌ర్లు క‌ట్ట‌బెట్టార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.  అందుకు సంబంధించి న‌కిలీ స‌ర్టిఫికేట్లు సృష్టించార‌ని తెలిసినా అప్ప‌టి ఎండీ సాంబ‌శివ‌రావు టెరా సాఫ్ట్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌ని స‌మాచారం. దీంతో ఈ ఫైబ‌ర్ నెట్ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు అందులో  రూ.330 కోట్ల మేర అవినీతి జ‌రిగింద‌ని ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. రెండు వేల కోట్ల రూపాయాల విలువైన టెండ‌ర్ల మొద‌టి ద‌శ‌లోనే అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో మొద‌ట 19 మందిపై సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. అందులో భాగంగా ఏ2 స్థానంలో ఉన్న సాంబ‌శివ‌రావును పోలీసులు ఇప్పుడు అరెస్టు చేశారు. అక్టోబ‌ర్ 1 వ‌ర‌కూ ఆయ‌న‌కు కోర్టు రిమాండ్ విధించ‌డంతో మ‌చిలీప‌ట్నం స‌బ్‌జైలుకి పంపించారు. ఇప్పుడీ తీగ లాగితే డొంకంత బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది. ఈ కుంభ‌కోణానికి కార‌ణ‌మైన వారంద‌రినీ అరెస్టు చేసే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. వీళ్ల‌లో పెద్ద పెద్ద త‌ల‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే చివ‌ర‌గా ఈ కేసు మాత్రం లోకేష్ బాబు మెడ‌కు చుట్టుకోవ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అప్పుడు ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్‌.. సాంబ‌శివ‌రావుపై ఒత్తిడి తెచ్చి బ‌ల‌వంత‌గా అనుమ‌తులు ఇప్పించార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ కేసులో చిన‌బాబు పాత్ర‌పై ఆధారాల‌ను సీఐడీ పోలీసులు సేక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. లోకేష్ పాత్ర ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మైన ఆధారాలు ల‌భిస్తే ఆయ‌న పేరును కేసులో ప్ర‌ధానంగా చేర్చే ఆస్కార‌ముంది. అందు కోసం ఈ కేసులో నిందితుల‌ను లోతుగా విచారిస్తున్నారు. మ‌రోవైపు 24 వేల కిలోమీట‌ర్ల ఫైబ‌ర్ ఆప్టిక‌ల్ లైన్ వేయ‌డానికి రూ.4 వేల కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని, కానీ రూ.330 కోట్ల‌తోనే టీడీపీ ప్ర‌భుత్వం ఆ ప‌ని పూర్తి చేసింద‌ని అందుకు మోడీ కూడా అభినందించార‌ని టీడీపీ నేత‌లంటున్నారు. ఏదేమైనా ఇక రాబోయే రోజుల్లో ఈ ఫైబ‌ర్ నెట్ కుంభ‌కోణం ఇటు రాష్ట్ర రాజ‌కీయాల‌తో పాటు అటు టీడీపీని కూడా వ‌దిలేసే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News