ఢిల్లీలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసిన ఫ్యాన్సీ షాపు యజమాని

Update: 2020-08-24 04:45 GMT
భారీ కుట్రను నిఘా వర్గాలు చేధించాయి. దీంతో.. పెను విధ్వంసం మిస్ అయ్యింది. పదిహేను కేజీల ఐఈడీ పేలుడు పదార్థాల్ని రెండు ప్రెషర్ కుక్కర్లలో అమర్చి.. ఢిల్లీలోని జనసమ్మర్థం ఉన్న ప్రాంతంలో పెట్టి మారణహోమాన్ని సృష్టించాలనే దారుణమైన ప్లాన్ ను అడ్డుకోగలిగారు అధికారులు. అన్ని సెట్ చేసి.. కేవలం టైమర్ ఒక్కటే సెట్ చేసే సమయంలో పోలీసులకు పట్టుబడిన ఈ ఉదంతం గురించి విన్నంతనే షాక్ తినక మానదు. అన్నింటికి మించి.. ఈ భారీ విధ్వంసానికి ప్లాన్ చేసిన వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ మరింత షాకింగ్ గా మారింది. బాంబులతో సహా అదుపులోకి తీసుకున్న ఈ ఐఎస్ ఉగ్రవాదికి సంబంధించిన వివరాల్ని ఢిల్లీ పోలీసులు తాజాగా వెల్లడించారు.

దేశ రాజధానిలో విధ్వంసం సృష్టించి.. పెద్ద ఎత్తున మానవహననానికి ప్లాన్ చేసిన వ్యక్తి ఎవరు? ఏం చేస్తుంటారో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ గ్రామంలో ఫ్యాన్సీ షాపును నిర్వహించే 36 ఏళ్ల మహ్మద్ ముష్తాకీమ్ ఖాన్ ఇంత దారుణమైన ప్లాన్ చేశారంటే ఎవరూ నమ్మరు.భార్య.. నలుగురు పిల్లలతో నివసించే సాదాసీదా వ్యక్తిగా కనిపించే అతడిలో.. దారుణమైన తీవ్రవాది దాగి ఉన్నాడు. ఐఎస్ సానుభూతిపరుడి పరిచయంతో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితుడయ్యాడు.

ఐఈడీ బాంబులు.. ఆత్మాహుతి బెల్ట్ లు తయారు చేయటం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో ఐఎస్ సూచనతో పంద్రాగస్టు వేళ..  ఢిల్లీలో భారీ విధ్వంసానికి తెరతీశాడు. రెండు ప్రెషర్ కుక్కర్ బాంబుల్ని సిద్ధం చేసుకున్న అతడు.. టైమర్ అమర్చి వెళ్లిపోయి ఉంటే.. దారుణ మారణహోం జరిగి ఉండేది. అయితే.. అతను అనూహ్యంగా పట్టుబడ్డాడని చెప్పక తప్పదు.

ఢిల్లీలోని ధౌలఖాన్ - కరోల్ బాగ్ రోడ్డులో టీవీఎస్ అపాచి బైక్ మీద వేగంగా వెళుతున్న మహ్మద్ ముష్తాకీమ్ ను గస్తీ నిర్వహించే పోలీసులు ఆపారు. దీంతో.. వారిపై అతడు కాల్పులు జరిపాడు. దీంతో.. ధీటుగా స్పందించిన పోలీసులు ఎదురుకాల్పులు జరిపాడు. ఈ క్రమంలో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న గన్ ను స్వాధీనం చేసుకున్నారు.

అతడి దగ్గర ఉన్న సంచిని చెక్ చేయగా.. రెండు ప్రషెర్ కుక్కర్లును గుర్తించారు. అందులో బాంబుల్ని సిద్ధం చేసిన వైనాన్ని చూసి.. ఉలిక్కిపడిన అధికారులు.. అతడ్ని విచారించారు. దీంతో.. మొత్తం విషయం బయటకు వచ్చింది. ఒకవేళ భద్రతా అధికారులు కానీ అతడ్ని ఆపి ఉండకపోతే.. బుద్ధ జయంతి పార్కులో గొయ్యి తీసి.. అందులో ఈ బాంబును ఫిక్స్ చేసి.. టైమర్ తో పేల్చాలన్నదే అతడి ప్లాన్. దీని గురించి తెలుసుకున్న అధికారులకు చెమటలు పుట్టించాయి. కనురెప్ప మాటలో మిస్ అయిన ఈ పేలుడు.. ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News