కేసీఆర్ కు ఈటల పంచ్ మామూలుగా లేదుగా?

Update: 2021-07-23 14:30 GMT
ఎవ్వరితో పెట్టుకున్నా ఫర్వాలేదు.. కానీ మన చేతిలో భంగపడి అవమానాల పాలైన వారితో పెట్టుకోవద్దు.. ఎందుకంటే మనతో సాన్నిహిత్యం నెరిపిన వారికి మన గుట్టూ మట్లు అన్నీ తెలుసు. అందుకే ఇప్పుడు ఈటల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడట..

ఇన్నాళ్లు కేసీఆర్ కేబినెట్ లో ఈటల మంత్రి. ఉద్యమకాలం నుంచి సహచరుడు. కేసీఆర్ చేసే పనులు.. వ్యవహారాలన్నీ తెలిసిన వ్యక్తి. అందుకే నేరుగా కేసీఆర్ ఎప్పుడూ విమర్శలకు దిగడం లేదు. ఆచితూచి అడుగులు వేస్తూ ఖచ్చితంగా ఈటలను ఓడించడానికి ప్రయత్నిస్తున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట మండలంలో ఐదోరోజు పాదయాత్ర చేపట్టిన ఈటల ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు బంగారు పల్లెంలో పెట్టి పదవి ఇచ్చినా అంటున్నావు.. బంగారు పల్లెంలో పెట్టి నీ బిడ్డకు బీఫామ్ ఇచ్చావు.. గెలిచిందా కేసీఆర్' అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు బంగారు పల్లెంలో పెట్టి బీఫాం ఇచ్చావ్ ఆయన గెలిచిండా? అని ఈటల సూటిగా విమర్శించాడు.

బీఫాం ఇవ్వడం అనేది కేసీఆర్ వంతు అని.. గెలవడం మాత్రం కష్టపడిన వాళ్ల వంతు అని ఈటల చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఓటుకు రూ.10వేలు ఇచ్చినా ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తా అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

పాదయాత్ర సందర్భంగా ఈటల సంచలన వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర బిందువు అవుతున్నారు. తన హత్యకు జిల్లాకు చెందిన ఓ మంత్రి కుట్ర పన్నారని ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. హంతక ముఠాతో చేతులు కలిపినట్లు తనకు సమాచారం ఉందని పేర్కొన్నారు.  నరహంతక గ్యాంగ్ స్టర్ నయీం చంపుతానంటేనే తాను భయపడలేదని.. మీరెంత? అంటూ ఈటల ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలకు తాను భయపడనని స్పష్టం చేశారు.  పాదయాత్రలో ఈటల రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో తాజాగా ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గం అంతా పాదయాత్ర చేపట్టి ప్రజలను కలుసుకునే పనిలో పడ్డారు. టీఆర్ఎస్ మాయలో పడొద్దని.. తననే గెలిపించాలని కోరుతున్నారు. ఈక్రమంలో టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తనపై ప్రజల్లో సానుభూతి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
Tags:    

Similar News