ఛాన్సును ఏ మాత్రం మిస్ చేసుకోని ఎర్రబెల్లి.. పొగడ్తలతో చెలరేగిపోయాడుగా

Update: 2020-11-01 03:30 GMT
అవకాశాలు చెప్పి రావు. అలాంటి చెప్పి మరీ వచ్చినప్పుడు.. తెలివైనోళ్లు ఆ సువర్ణ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోరు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి తనకు లభించిన అద్భుతమైన అవకాశాన్ని నూటికి నూరు శాతం వాడేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రీం ప్రాజెక్టుల్లో ఒకటైన రైతు వేదికను జనగామ జిల్లాలో షురూ చేయటంతో.. అదే జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. సారు మనసును రంజింపచేసే ప్రయత్నం చేశారు. రైతు వేదికను ప్రారంభించిన సందర్భంలో ప్రసంగించేందుకు వచ్చిన అవకాశాన్ని ఆయన అస్సలు వదిలిపెట్టలేదు.

సీఎం కేసీఆర్ ను మహరాజుగా అభివర్ణిస్తూ ఎర్రబెల్లి ప్రసంగం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన పొగడ్తల పర్వం అతిశయోక్తుల్నిదాటిపోయింది. కాకతీయుల్ని మించిన రాజుగా గులాబీ బాస్ ను అభివర్ణించారు. నాడు కాకతీయులు చెరువులు నిర్మిస్తే.. గత పాలకులు వాటిని నిర్లక్ష్యంచేశారని.. సీఎం కేసీఆర్ వాటిని మిషన్ కాకతీయ పేరుతో బాగు చేసి.. ప్రతి ఎకరానికి గోదావరి జలాలను అందిస్తున్నారంటూ ఆకాశానికి ఎత్తేశారు.

ఓవైపు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందజేయటం.. రెండు పంటలకు అవసరమైన పెట్టుబడి కోసం ఎకరానికి రూ.10వేలు ఇవ్వటం.. రైతుబీమా కల్పిస్తున్న మహానుభావుడిగా ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. కేసీఆర్ పథకాల్ని ఏకరువు పెట్టటమే కాదు.. ప్రస్తుతం కేసీఆర్ కోపంగా ఉన్న కేంద్రాన్ని సైతం ఆయన వదిలిపెట్టలేదు. కేంద్రం ఎన్ని దొంగ బిల్లులు తెచ్చి నష్టం కలిగించినా కేసీఆర్ ప్రాణం ఉన్నంత వరకు రైతుల మీద ఈగ వాలనివ్వరన్నారు.

తనను మంత్రిని చేసిన కేసీఆర్ కు బహిరంగ సభ సాక్షిగా కృతజ్ఞతలు చెప్పి ఆయన మనసును మరింత ఖుషీ చేశారని చెప్పాలి.  ‘మీ దయ వల్ల మంత్రిని అయ్యాను. నియోజకవర్గాన్ని బాగు చేసుకుంటున్నా.. మంత్రిగా ఉమ్మడి వరంగల్ జిల్లాను కూడా మీ ఆశీస్సులతో డెవలప్ చేసుకుంటా’ అని మొహమాట పడకుండా తన విధేయతను మరోసారి చాటుకున్నారు ఎర్రబెల్లి.
Tags:    

Similar News