మావో అగ్రనేత ఆర్కే జస్ట్ మిస్ అయ్యారా?

Update: 2020-07-23 05:30 GMT
ఒకప్పుడు దేశంలో మావోల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అప్పట్లో వారెంత బలంగా ఉండేవారంటే.. రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి నిండా కునుకు ఉండేది కాదు. ఎప్పుడేం జరుగుతుందో అర్థమయ్యే పరిస్థితి లేదు. 2000 నుంచి కాస్త తగ్గుముఖం పట్టినా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 2005 తర్వాత భారీ మార్పులే చోటు చేసుకున్నాయి. నాటి ప్రభుత్వం అనుసరించిన విధానాలతో తెలుగు రాష్ట్రాల్లో మావోలు తమ ఉనికిని కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని చెదురుముదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాలు మావోలకు సేఫ్ కాదన్న విషయం అర్థం కావటంతో పాటు.. పోలీసుల నిఘా కళ్ల నుంచి తప్పించుకోవటం కష్టమన్న విషయాన్ని గుర్తించిన వారు ఒడిశా.. ఛత్తీస్ గఢ్ లకు షిఫ్ట్ అయ్యారు.

ఇదిలా ఉంటే.. మావో పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే తాజాగా మరోసారి పోలీసుల ఉచ్చు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. దీంతో.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ తప్పించుకున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా జరిపిన పోలీసుల కాల్పుల్లో పార్టీ మరో అగ్రనేత కమ్ ఏవోబీ కార్యదర్శి చలపతి.. ఆయన భార్య అరుణలు తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలోని పొదలు.. ఆకులు.. రాళ్ల గుట్టలపై కనిపించిన రక్తపు మరకల ఆధారంగా పోలీసులు ఈ నిర్దారణకు వచ్చారు.

ప్రతి ఏటా నిర్వహించే అమరవీరుల వార్షిక వారోత్సవాల్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు మావోలు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లా బెజ్జంగి అటవీ ప్రాంతంలో సమావేశమైన విషయాన్ని ఈనెల 14న నిఘా వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన మావో పార్టీ అగ్రనేతలు.. స్థానిక కీలక మిలీషియా సభ్యులు కూడా పాల్గొన్నారని తెలిసింది. దీంతో.. అప్రమత్తమైన పోలీసు అధికారులు ఉచ్చు బిగించారు. సమయం చూసుకొని కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

తొలుత వచ్చిన మావో టీంను వదిలేసిన పోలీసులు.. తర్వాత వచ్చిన రెండో టీంపై కాల్పులు జరిపారు. మొదటి టీం క్షేమంగా వెళ్లటంతో ఫర్లేదని భావించిన వారికి పోలీసుల కాల్పులు షాకింగ్ గా మారినట్లు చెబుతున్నారు. ఊహించని విధంగా పోలీసులు కాల్పులు జరపటంతో అలెర్ట్ అయిన బృందం రెండుగా చీలి పోలీసులపై ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. ఈ సమయంలోనే చలపతి.. అరుణలు తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మావో పార్టీ అగ్రనేత ఆర్కే.. మూడో టీంలో  ఉన్నట్లుగా భావిస్తున్నారు. రెండో టీంపైన ఎప్పుడైతే కాల్పులు జరిగాయో.. వెంటనే అప్రమత్తమైన మూడో టీం తప్పించుకున్నట్లుగా తెలుుస్తోంది. ఇందులోనే ఆర్కే ఉన్నట్లుగా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలోనూ ఇదే రీతిలో పలుమార్లు తప్పించుకోవటం గమనార్హం.
Tags:    

Similar News