ప్రముఖ ఆర్థికవేత్త‌ ఇషర్‌‌ అహ్లువాలియా కన్నుమూత

Update: 2020-09-26 17:30 GMT
ప్రముఖ ఆర్థికవేత్త‌ డాక్టర్‌ ఇషర్‌ జడ్జ్‌ అహ్లువాలియా(74) శనివారం నాడు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా బ్రెయిన్ కాన్సర్‌ కు చికిత్స పొందుతున్న అహ్లువాలియా శనివారం కన్నుమూశారు. ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా,ఇషర్‌ జడ్జ్‌ అహ్లువాలియా దంపతులకు పవన్‌, అమన్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐసీఆర్‌ఐఈఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనమిక్‌ రిలేషన్స్‌)‌ చైర్‌పర్సన్‌గా గత 15 సంవత్సరాలుగా ఇషర్ సేవలలందించారు.  అనారోగ్యంతో గత నెలలో పదవి నుంచి వైదొలిగారు. ఆర్థిక వృద్ధి, ఉత్పాదకత, పారిశ్రామిక, వాణిజ్య విధాన సంస్కరణలు, పట్టణ ప్రణాళిక, అభివృద్ధి వంటి రంగాల్లో ఆమెకు విస్తృత అనుభవం ఉంది.  ఐసీఆర్‌ఐఈఆర్‌లో ఆమె భారతదేశంలో పట్టణీకరణ సవాళ్లపై ప్రధాన పరిశోధన, సామర్థ్య అభివృద్ధి కార్యక్రమానికి నాయకత్వం వహించారు.  విద్య, సాహిత్య రంగంలో ఇషర్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా 2009లో పద్మ భూషణ్‌ అవార్డుతో ఆమెను భారత ప్రభుత్వం సత్కరించింది.

ఇషర్‌ జడ్జ్‌ అహ్లువాలియా మృతి పట్ల మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అహ్లువాలియా కుటుంబానికి ఎంతోమంది ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా అహ్లువాలియా ఎనలేని కృషి చేశారని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రశంసించారు. అహ్లువాలియాతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని బయోకాన్‌ ఎండీ కిరణ్‌ మజుందార్‌ షా గుర్తుచేసుకున్నారు. ప్రతిభావంతురాలైన తన స్నేహితురాలిని కోల్పోయానని, ఆమె జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకమని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇషర్ అహ్లువాలియా భారతదేశంలోని విశిష్టట ఆర్థికవేత్తలలో ఒకరని, ఆమె లేని లోటు పూడ్చలేనిదని  మాజీ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. మాంటెక్ సతీమణిగా కాకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.
Tags:    

Similar News