ముందస్తు లేదు వెనకస్తు లేదు

Update: 2018-09-02 15:01 GMT
ముందస్తు లేదు వెనకస్తు లేదు. ఏదో జరిగిపోతుందని, ముందస్తు ఎన్నికల ప్రకటన వచ్చేస్తుందని ఆశించిన అందరికీ నిరాశ ఎదురయింది. ప్రగతి నివేదన సభలో ముందస్తు పై ప్రకటన చేస్తారని - ముందున్నది ఎన్నికల సమరమేనని అందరూ ఊహించిన దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తుస్సుమనిపించారు. ఆర్భాటంగా, అట్టహాసంగా 20 రోజుల నుంచి చేపడుతున్న ప్రగతి నివేదన సభ గడచిన నాలుగేళ్లలో సాధించిన అంశాలను చెప్పడం కేసీఆర్ మరచారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గడచిన నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏం చేసిందో వివరించేందుకు ఉద్దేశించిన సభలో ఎక్కువ సమయాన్ని ప్రత్యేక తెలంగాణ‌ సాధించడం కోసం తాను ఏం చేశానో చెప్పేందుకే ముఖ్యమంత్రి  కె. చంద్ర శేఖర రావు తన సమయాన్ని కేటాయించారు. నాలుగేళ్లలో తాను సాధించింది ఎన్నికల మ్యేనిఫెస్టోలో చెబుతామని, అలాగే ఏం చేస్తామో కూడా అందులోనే వివరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. మంత్రి వర్గ సహచరుడు - మేనల్లుడు అహర్నిశలు కష్టపడుతున్న మంత్రి హరీష్ రావు పేరు ప్రస్తావించకుండా నేటి మిషన్ భగీరథ‌, - మిషన్ కాకతీయకు తాను 2006 లోనే ఆలోచన చేశానని చెప్పారు. ఇది తన మంత్రి వర్గ సహచరుడి పనితీరును అవమానించడమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు విస్పష్టమైన ప్రకటన చేస్తారని తెలంగాణ ప్రజలు - ప్రతిపక్షాలు - మీడియా ఎదురు చూశారు. అయితే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాత్రం చాలా తెలివిగా, జాగరూకతతో ఈ బహిరంగ సభలో ప్రసంగించారు. ముందస్తు ఎన్నికలు గాని, అందుకు సంబంధించిన సంకేతాలు కాని ఎలాంటివి ప్రకటించకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ప్రగతి నివేదన సభ నిర్వహించాలని - అందుకు భారీ ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకులకు - మంత్రులకు చెప్పిన ముఖ్యమంత్రి ఈ సభను సాదాసీదాగా ముంగించేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇలా ముగించేయడానికి తాము ఏం చేశామో తెలియజేసే నివేదిక సభను హఠాత్తుగా చల్లార్చడానికి కారణాలు ఏమై ఉంటాయని రాజకీయ పార్టీలలో చర్చ జరుగుతోంది.
Read more!

వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి - హంగు ఆర్భాటాలతో నివేదిక సభను ఏర్పాటు చేసి చివరి నిమిషంలో తుస్సుమనిపించడం ఏమిటని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో జోనల్ వ్యవస్థకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ హడావుడిగా ఆర్డినెన్స్ తేవడంతో ప్రగతి నివేదిక సభ పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మిన్నకుండిపోయారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే ఇంత హడావుడిగా, హంగామాగా లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించిన ముఖ్యమంత్రి ఇలా నీరస‌ రీతిలో ఎలా ప్రసంగిస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ప్రతిపక్ష పార్టీలపై నోరు మెదపకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
Tags:    

Similar News