డ్ర‌గ్స్ వినియోగంః అమెరికా ఫ‌స్ట్‌.. పాకిస్థాన్ సెకండ్‌.. భార‌త్..?

Update: 2021-03-10 23:30 GMT
మద్యం తాగ‌డం మామూలే.. గంజాయి తీసుకోవ‌డం మ‌రీ మోటు.. మ‌రి, స్టైలిష్ గా మ‌త్తులో మునిగిపోవాలంటే.. ఏం చేయాలి..? అంటే.. క‌నిపించే ఆప్ష‌న్ డ్రగ్స్! అవును.. ఆధునిక‌త విస్త‌రిస్తున్న కొద్దీ మ‌త్తు ప‌దార్థాలు కొత్త రూపును సంత‌రించుకుంటున్నాయి. వివిధ ర‌కాల్లో ల‌భించే డ్ర‌గ్స్ ను తీసుకుంటూ గ‌మ్మ‌త్తైన లోకంలో విహ‌రిస్తోంది ప్ర‌పంచం. ఈ విధంగా ప్ర‌పంచంలో అత్య‌ధికంగా డ్ర‌గ్స్ తీసుకుంటున్న వారెవ‌ర‌ని ప‌రిశీలిస్తే.. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెలుగు చూశాయి.

మ‌న భార‌త్ లో డ్ర‌గ్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందో బాలీవుడ్ ఉదంతం అధికారికంగా బ‌య‌ట పెట్టింది. కానీ.. అన‌ధికారికంగా విచ్చ‌ల‌విడిగా డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌ని వెల్ల‌డించింది ఓ స‌ర్వే. జ‌ర్మ‌నీకి చెందిన ఏబీసీడీ అనే సంస్థ స‌ర్వే చేప‌ట్టింది. ఈ నివేదిలో ప్ర‌పంచంలో అత్య‌ధికంగా డ్ర‌గ్స్ తీసుకుంటున్న న‌గ‌రాల్లో అమెరికాలోని న్యూయార్క్ మొద‌టి స్థానంలో నిలిచింది. ఈ న‌గ‌రంలో ప్ర‌తీ సంవ‌త్స‌రం దాదాపు 70 వేల 252 కేజీల డ్ర‌గ్స్ ను వినియోగిస్తున్నార‌ట జ‌నాలు.

ఇక రెండో స్థానంలో నిలిచింది పాకిస్తాన్‌. ఈ దేశ ఆర్థిక రాజ‌ధాని క‌రాచీలోని జ‌నం ఏడాదికి 38 వేల 56 కేజీల డ్ర‌గ్స్ ను పీల్చేస్తున్నార‌ట‌. ఇక‌, వీరి త‌ర్వాత అత్య‌ధికంగా డ్ర‌గ్స్ వాడుతున్న వారిలో భార‌తీయులే ఉండ‌డం గ‌మ‌నార్హం. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌తీఏటా 34 వేల 708 కేజీల డ్ర‌గ్స్ ను వినియోగిస్తున్నార‌ట‌. ఒక్క న‌గ‌రంలోనే ఇంత డ్ర‌గ్స్ తీసుకుంటే.. దేశం మొత్తంలో ఎంత పీలుస్తున్నారోన‌న్న‌ది ఊహ‌కే అంద‌ట్లేదు.

ఈ డ్ర‌గ్స్ వినియోగం ద్వారా ఆరోగ్యంపై ఎన్నో దుష్ప్ర‌భావాలు చూపుతున్న‌ప్ప‌టికీ.. జ‌నాలు ప‌ట్టించుకోవ‌ట్లేదు. ప్ర‌ధానంగా యువ‌త ఈ మ‌త్తులో జోగుతోంది. త‌ల్లిదండ్రులు ఓ కంట క‌నిపెట్ట‌డం ద్వారా పిల్ల‌లు ఈ రొంపిలోకి దిగ‌కుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం.. మ‌న దేశంలో గ‌డిచిన ఐదేళ్ల‌‌లో సుమారు 19 ల‌క్ష‌ల కిలోల డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డింది. పోలీసుల‌కు దొరికిన డ్ర‌గ్సే ఇంత మేర ఉంటే.. ఇక వినియోగించింది ఎంత మేర ఉంటుందో అంచ‌నా వేసుకోండి.. అది మీ ఊహ‌!
Tags:    

Similar News