సోనియాకు షాకిచ్చేందుకు బీజేపీ పెద్ద ప్లాన్

Update: 2019-04-12 08:09 GMT
కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. దేశవ్యాప్తంగా ఏ పార్టీ గాలి వీచినా.. అక్కడ మాత్రం కాంగ్రెస్‌ మాత్రమే గెలుస్తుంది. ఎన్నో పార్టీలు.. ఎందరో మహానాయకులు ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను ఓడించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. రెండుసార్లు మినహా దశాబ్దాల పాటు గాంధీ కుటుంబాన్ని ఆదరిస్తున్నారు అక్కడి ప్రజలు. ఆ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా వేరే పార్టీ వైపు చూడరు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ సైతం అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. మిగతా నియోజకవర్గాల కంటే ఇక్కడ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్‌ ను కాదని అక్కడి నియోజకవర్గ ప్రజలు బీజేపీని గెలిపిస్తారా..? ఇంతకీ ఎక్కడుంది ఆ నియోజకవర్గం..

దేశవ్యాప్తంగా గత ఎన్నికల్లో కమలం గాలి వీచింది. అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంపై కాషాయం జెండా ఎగిరింది.  కానీ రాష్ట్రంలోని రాయబరేలి నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీనే గెలిచింది. కారణం అక్కడ ఆ పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధి ప్రాతినిథ్యం వహించడమే. భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇక్కడ మొదటిసారి ప్రచారం చేయడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆక్కడి ప్రజలు ఆ కుటుంబాన్నే ఆదరిస్తున్నారు. అనారోగ్యం గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న సోనియాగాంధీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. కానీ మొదటి జాబితాలోనే ఆమె పేరు ప్రకటించడంతో నాయకుల్లో ఉత్సాహం నెలకొంది. దీంతో ఆరోసారి ఆమె గెలుపుకోసం నియోజకవర్గాల్లో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.

*నియోజకవర్గ చరిత్ర:

1952లో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 14 సార్లు కాంగ్రెస్‌ పార్టీయే గెలిచింది. 1952లో తొలిసారి కాంగ్రెస్‌ తరుపున ఫిరోజ్‌ గాంధీ గెలిచారు. 1996 -1998లో బీజేపీ విజయం సాధించింది.

ఓటర్లు:15 లక్షలు

మరోవైపు ఈసారి ఎన్నికల్లో సోనియగాంధీని కచ్చితంగా ఓడిస్తామని కలమనాథులు పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా రాయబరేలీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ కి ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో ఆమె తరుచూ సందర్శిస్తున్నారు. అంతేకాకుండా మంత్రి అరుణ్‌జైట్లీ సైతం ఇదే నియోజకవర్గం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఎంపీ ల్యాడ్స్‌ కింద అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

ఇక సోనియాపై బీజేపీ అభ్యర్థిగా సీనియర్‌ నేత దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ బరిలో ఉన్నారు. ఈయన ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగారు. సంవత్సరం కింద ఆయన పార్టీని వీడి కమలం తీర్థం పుచ్చుకున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ కుటుంబం గుప్పిట్లో చిక్కుకున్న నియోజకవర్గంపై తమ జెండా ఎగురవేస్తామని బీజేపీ శ్రేణులు అంటున్నారు. అంతేకాకుండా సొంత నియోజకవర్గంలో ఏనాడు పర్యటించని సోనియాగాంధీ ఎన్నికలు గుర్తుకురాగానే ఇక్కడికి వస్తున్నారని అంటున్నారు. ఒకదశలో ఇక్కడ సోనియా కూతురు ప్రియాంక గాంధీని బరిలో దించేలా ప్రయత్నాలు జరిగాయి. కానీ సోనియా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఆమె ప్రచారానికే పరిమితమయ్యారు.
Tags:    

Similar News