మీడియాపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు..

Update: 2020-10-29 10:30 GMT
అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ట్రంప్ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో చెప్పలేం. తనను..తన అభిప్రాయాల్ని ఏ మాత్రం వ్యతిరేకించినా ఆయన ఆగ్రహానికి గురి కాక తప్పదు. ఎప్పటికప్పుడు జీహుజూర్ అన్నట్లుగా వ్యవహరించాల్సిందే. అలా కాని పక్షంలో ఎంతకైనా సరే.. అన్నట్లుగా వ్యవహరించే ట్రంప్.. మొదట్నించి మీడియాలోని కొన్ని వర్గాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. మీడియా తన విషయంలో వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపిస్తుంటారు. ఆయన్ను.. ఆయన విధానాల్ని విమర్శించే మీడియా సంస్థలపై ఇప్పటికే పలుమార్లు విమర్శించిన ట్రంప్.. తాజాగా కీలకమైన ఎన్నికల వేళ మరోసారి మండిపడ్డారు.

తన రాజకీయ ప్రత్యర్థి.. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతడు సాగించిన అవినీతి గురించి అమెరికన్ ప్రజలకు తెలీకుండా మీడియా సంస్థలు.. బడా టెక్నాలజీ సంస్థలు  ఉద్దేశపూర్వకంగా తొక్కి పెడుతున్నాయన్నారు. ‘‘బెడైన్ పై అంత ప్రేమ ఎందుకు? మాస్కో మాజీ మేయర్ కు అత్యంత సన్నిహితుడైన బైడెన్ కు రష్యా నుంచి 3.5 మిలియన్ డార్లు అందాయి’’ అని ఆరోపించారు. ఇటీవల కాలంలో ఆయన ఈ తరహా ఆరోపణలు చేయటం గమనార్హం.

ట్రంప్ తనపై చేస్తున్న ఆరోపణల్ని జో బైడెన్ తీవ్రస్థాయిలో తిప్పి కొట్టారు. తనపై ట్రంప్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇదిలా ఉంటే.. మీడియాపై తన విమర్శల పర్వాన్ని కంటిన్యూ చేస్తున్న ట్రంప్.. ‘‘బైడెన్ నుంచి ప్రయోజనం పొందిన మీడియా సంస్థలు.. టెక్ సంస్థలు ఆయన్ను కాపాడేందుకు ఆరాటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని గతంలో మరెప్పుడూ చూడలేదు. పక్షపాత వైఖరి మీడియాకే నష్టం’’ అని పేర్కొన్నారు.

తాజాగా జరుగుతున్న ఎన్నికలు కోలుకుంటున్న సూపర్ ఎకానమీకి.. బైడెన్ డిప్రెషన్ కు మధ్య పోరుగా ట్రంప్ అభివర్ణించారు. ఎన్నికల్లో అమెరికన్లు దేనిని ఎంచుకుంటారో నిర్ణయించుకోవాలన్నారు. తన ప్రత్యర్థిని మొదలు.. మీడియా.. బడా టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ట్రంప్ తీరు చూస్తే.. ఎన్నికల వేళ ఏమైనా చేసి ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పక తప్పదు.
Tags:    

Similar News