వైసీపీకి లోలోపల ఖుషి...అయినా డౌట్స్ ?

డీలిమిటేషన్ దెబ్బ నుంచి తృటిలో వైసీపీ తప్పించుకుంది. పార్లమెంట్ లో ఈ నెల 17న ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి పాలు కావడం వైసీపీకి లోలోపల ఆనందాన్ని ఇచ్చింది అని అంటున్నారు.;

Update: 2026-04-20 12:30 GMT

డీలిమిటేషన్ దెబ్బ నుంచి తృటిలో వైసీపీ తప్పించుకుంది. పార్లమెంట్ లో ఈ నెల 17న ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి పాలు కావడం వైసీపీకి లోలోపల ఆనందాన్ని ఇచ్చింది అని అంటున్నారు. ఎందుకంటే ఈ బిల్లు కనుక సవ్యంగా పాస్ అయి ఉంటే ఏపీలో తొలి దెబ్బ వైసీపీకే పడేది అని అంటున్నారు. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు సీఎం గా ఉన్నారు. ఆయన అపర చాణక్యంతో డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది అంటే వైసీపీ బలమంతా దూది పింజె మాదిరిగా ఎగిరిపోయేదని విశ్లేషణలు ఉన్నాయి.

బలమున్న చోట వీక్ :

వైసీపీ బలం ఉన్న చోట్ వీక్ చేస్తూ ఆ పార్టీ పుట్టె ముంచగలిగే విధంగా ఈ డీలిమిటేషన్ అధికార కూటమికి ఒక బ్రహ్మాస్త్రంగా పనిచేసేది అని అంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్. ఇక్కడ ఫ్యాన్ పార్టీ కకావికలు అయ్యే విధంగా కూటమి భారీ స్కెచ్ రూపొందించింది అన్న వార్తలు కూడా ఆ మధ్య వినిపించాయి. ఆఖరికి వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల సైతం రెండు ముక్కలు అయ్యేదని వైసీపీ కుటుంబానికి యాభై ఏళ్ళుగా కంచుకోటగా ఉన్న ప్రాంతం పూర్తిగా కొత్త రూపు సంతరించుకుంటే జగన్ కి పోటీ చేసేందుకు సైతం వేరే నియోజకవర్గం ఎంపిక చేసుకునే పరిస్థితి ఉండేదని కూడా చర్చ సాగింది. అంతే కాదు వైసీపీకి చెందిన దిగ్గజ నేతల స్థావరాలు సైతం డీలిమిటేషన్ ప్రక్రియలో కొట్టుకుని పోయేవని కూడా ప్రచారం సాగింది. అయితే డీలిటేషన్ ప్రక్రియ అన్నదే లేకుండా చివరిలో ఇండియా కూటమి యాంటీ చేసి గండి కొట్టింది.

జగన్ విమర్శించినా :

మహిళా బిల్లుని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని డీలిమిటేషన్ కాకుండా చేశారు అని జగన్ భారీ ట్వీట్ చేసి మరీ జాతీయ స్థాయిలో విపక్షాలను విమర్శించినా లోగుట్టు అయితే వైసీపీకి ఈ పరిణామం మహదానందం కలిగించింది అని అంటున్నారు. విపక్షం అంతా ఒక్కటిగా నిలిచి బిల్లుని ఓడించకపోతే ఈపాటికి దేశంలో విపక్షాల భయాలు సందేహాలు ఎలా ఉన్నా ఏపీలో మాత్రం వైసీపీకి అసలుకే ఎసరు వచ్చేసి ఉండేదని అంటున్నారు. దీంతో వైసీపీ నేతలు అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు అని అంటున్నారు.

ఆ బెంగ ఉందిగా :

అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఇంకా చేతిలో మూడేళ్ళ పాటు అధికారం ఉంది. దాంతో పాటుగా పట్టుదలకు మారు పేరు అయిన ఆయన మరో రూపంలో కనుక ఈ డీలిమిటేషన్ బిల్లు తీసుకుని వస్తే ఎలా అన్నదే చర్చగా ఉంది. అంతే కాకుండా ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. కేంద్రంలో టీడీపీ మంత్రులు ఉన్నారు. కాబట్టి డీలిమిటేషన్ ప్రక్రియ జాతీయ స్థాయిలో నిలిచిపోయినా ఏపీ తెలంగాణా రాష్ట్రాల మేరకు అసెంబ్లీ సీట్ల పెంపుదలకు గట్టిగా పట్టుబట్టి ఒప్పించినట్లు అయితే ఆ రూపంలో అయినా సీట్లు పెరుగుతాయని అంటున్నారు. అదే జరిగితే పులి మీద పుట్ర అన్నట్లు మరో కొత్త ముప్పు వైసీపీకి పొంచి ఉన్నట్లే అని అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతానికి మాత్రం వైసీపీకి భారీ రిలాక్స్ అయితే వచ్చిందని అంటున్నారు. మరి ఇంతా చేసి ఎందుకు డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చింది అంటే అక్కడే ఉంది రాజకీయ మతలబు అని అంటున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ కి చెడ్డ కాకుండా అక్కడ ఓటేసినా మనసంతా డీలిమిటేషన్ బెంగతోనే నిండిపోయిందని అంటున్నారు. అలా వైసీపీ బెంగ పడిన వేళ కాగల కార్యాన్ని ఇండియా కూటమి తీర్చేసింది అని అంటున్నారు. మొత్తం మీద అయితే రాహుల్ గాంధీకి వైసీపీ థాంక్స్ చెప్పుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పడుతున్నాయి.

Tags:    

Similar News