జన నాయగన్ Vs లోకనాయకన్.. తమిళనాడులో స్టార్ వార్!

తమిళనాడు అసెంబ్లీకి ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. 21న అనగా మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి బ్రేకులు వేయాల్సివుంది.;

Update: 2026-04-20 09:52 GMT

తమిళనాడు ఎన్నికల్లో స్టార్ వార్ ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా ఎన్నికలను త్రిముఖ పోటీగా మార్చేసిన దళపతి విజయ్ లక్ష్యంగా లోకనాయకుడు కమలహాసన్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. రాజకీయంగా ఇద్దరు భిన్న వైఖరి అవలంబిస్తున్నారు. కమల హాసన్ అధికార డీఎంకే పార్టీకి మద్దతు ఇస్తుండగా, డీఎంకే ప్రభుత్వాన్ని కూల్చి తాను ముఖ్యమంత్రి కావాలని దళపతి విజయ్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దూకుడుకు కళ్లెం వేసేలా డీఎంకే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దళపతి విజయ్ పోటీ చేస్తున్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ గా కమలహాసన్ ను ఎంపిక చేసింది.

తమిళనాడు అసెంబ్లీకి ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. 21న అనగా మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి బ్రేకులు వేయాల్సివుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఇక డీఎంకే అనూహ్యంగా లోకనాయకుడు కమలహాసన్ ను తెరపైకి తీసుకువచ్చింది. ప్రచారం రెండు రోజుల్లో ముగుస్తుందనగా, ఆదివారం కోయంబత్తూరులో కమలహాసన్ తో ప్రచారం చేయించింది. కమల్ హాసన్ తో మొత్తం 15 ఎన్నికల ప్రచార సభలను నిర్వహించాలని డీఎంకే ప్లాన్ చేసింది. ఇందులో దళపతి విజయ్ పోటీ చేస్తున్న పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాలు ఉండటం గమనార్హం.

కమలహాసన్ ఎంట్రీతో తమిళనాడు ఎన్నికల ప్రచారం అనూహ్య మలుపు తిరిగిందని విశ్లేషిస్తున్నారు. సినీ రంగం నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన కమల హాసన్ ఎంఐఎం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తన పార్టీని పోటీకి దూరంగా పెట్టిన కమల్ హాసన్ అధికార డీఎంకే మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఆయన దళపతి విజయ్ కి వ్యతిరేకంగా ప్రచారం చేసే అంశమే ఆసక్తికరంగా మారింది.

కరూర్ తొక్కిసలాట, జననాయగన్ చిత్రం లీక్ పై విజయ్ కి బాసటగా గతంలో మాట్లాడిన కమల్ హాసన్ రాజకీయ వర్గాలను ఆకర్షించారు. అప్పుడు విజయ్ ని వెనకేసుకు వచ్చిన ఉళగ నాయగన్ (లోక నాయకన్) ఇప్పుడు దళపతిపై ఎలాంటి విమర్శలు చేస్తారని ఆసక్తి కనిపిస్తోంది. తమిళనాడులో అగ్రహీరోగా కమల్ హాసన్ కు ఎంతో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇండస్ట్రీ పెద్దగా ఉన్న ఆయన సాటి నటుడిపై ఎలాంటి విమర్శలు చేస్తారు? దీనిపై దళపతి విజయ్ ఎలా ఎదుర్కొంటారు? ఆయన ఇచ్చే కౌంటర్ ఎలా ఉండబోతోంది అన్నది ఉత్కంఠకు గురిచేస్తోంది.

Tags:    

Similar News