అలా చేస్తే పెట్రోలు ధ‌ర‌లు త‌గ్గుతాయిః కేంద్ర మంత్రి

Update: 2021-02-20 16:30 GMT
దేశంలో పెట్రోలు ధ‌ర‌లు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ప‌లుచోట్ల లీట‌రు పెట్రోలు ధ‌ర‌ రూ.100 మార్కును దాటాయి. డీజిల్ ధర కూడా ఇదే దారిలో పెరిగిపోతోంది.  ఈ స్థాయిలో పెట్రోలు ధ‌ర‌లు గ‌తంలో ఎప్పుడూ పెర‌గ‌లేద‌న్న‌ది య‌థార్థం. ఈ స్థాయిలో పెరుగుతున్నా కేంద్రం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక‌, సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఇంత జ‌రుగుతున్నా కేంద్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ స‌మ‌స్య‌ ఇబ్బందికరమైనదే అని అన్నారు. అయితే.. ఈ ధరల తగ్గింపునకు ఒక మార్గం ఉంద‌న్నారు.

పెట్రోల్ ధరలో పన్నులే 60 శాతం ఉన్నాయన్నారు. డీజిల్ ధరలో 54 శాతం పన్నులు ఉన్నాయని చెప్పారు. అందువల్ల.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ రెండు ప్ర‌భుత్వాలు చర్చించుకొని ధరలను ఆమోదయోగ్యమైన స్థాయికి తగ్గించుకుంటే బాగుంటుందని అన్నారు.

ఇదిలా ఉంటే.. దేశంలో ఇంధన ధరలు వరుసగా 12 రోజులుగా పెరుగుతూనే వస్తున్నాయి. ఈరోజు పెట్రోల్ రేటు 40 పైసలు, డీజిల్ ధర 40 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో లీట‌రు పెట్రోల్ ధర రూ.94.18కు, డీజిల్ ధర రూ.88.31కు చేరాయి.

అటు అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 39 పైసలు పెరుగుదలతో లీట‌రు ధ‌ర రూ.96.48కు చేరింది. డీజిల్ పై 39 పైసలు పెర‌గ‌డంతో.. లీట‌రు రూ.90.10ల‌కు పెరిగింది. పెట్రోధ‌ర‌ల పెరుగుద‌ల‌పై విప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగానే ధ‌ర‌ల నియంత్ర‌ణ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకొని, నిర్ణ‌యాధికారం ఆయిల్ కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టింద‌ని విమ‌ర్శిస్తున్నాయి. ఆ ఫ‌లితంగానే.. ఆయా కంపెనీలు ఇష్టారాజ్యంగా ధ‌ర‌లు పెంచుకుంటూ వెళ్తున్నాయ‌ని, అయినా కూడా కేంద్రం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నాయి.
Tags:    

Similar News