కన్నడ పాలిటిక్స్ లో సంచలనం..డీకే అరెస్ట్

Update: 2019-09-03 16:05 GMT
సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన కర్ణాటకలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - మాజీ మంత్రి... ఆ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన డీకే శివకుమార్ అరెస్ట్ అయ్యారు. మనీ లాండరింగ్ ఆరోపణల్లో ఐదు రోెజులుగా తమ ముందు విచారణకు హాజరవుతున్న డీకేను ఎన్‌ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మంగళవారం రాత్రి 8.38 గంటలకు ఆయనను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తునకు ఆయన సహకరించడం లేదని - పీఎంఎల్ ఏ అభియోగాల కింద ఆయనను అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం కర్ణాటక రాజకీయాలను మరోమారు వేడెక్కించేలానే ఉందన్న వాదన వినిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా - దమ్మున్న నేతగా పేరుగాంచిన డీకే... జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ కూటమిలో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ కు సీఎం పోస్టు దక్కితే... అది డీకేకేనన్న వాదనలూ వినిపించాయి. అయితే కేవలం మంత్రి పదవితోనే సరిపెట్టుకున్న డీకే... సంకీర్ణ సర్కారును కాపాడేందుకు తనతైన శైలి యత్నాలు చేశారు. బీజేపీ దరికి చేరిన ఎమ్మెల్యేలను వెనక్కు తీసుకొచ్చేందుకు ఆయన ముంబై వేదికగా చేసిన యత్నాలు మనకు తెలిసిందే. పార్టీలో సీనియర్ గానే కాకుండా పార్టీకి ఏ కష్టం వచ్చినా... తానున్నానంటూ నిలబడ్డ నేతగా డీకేకు మంచి పేరుంది. అయితే సంకీర్ణ సర్కారు కూలి బీజేపీ సర్కారు అధికారం చేపట్టాక డీకేకు కష్టాలు మొదలయ్యాయి.
Read more!

సరే అరెస్ట్ వరకైతే ఓకే గానీ... డీకేను అరెస్ట్ చేసిన తీరే అందరినీ నివ్వెరపరుస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకేపై ఈడీ కేసు నమోదు చేయడంతో పాటుగా తమ ముందు హాజరు కావాలంటూ గత వారం నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరుకాకముందే ముందస్తు బెయిల్ కోసం డీకే కోర్టును ఆశ్రయించడంతో ఆయన అరెస్ట్ ఖాయమనే వాదన వినిపించింది. ముందస్తు బెయిల్ కు కోర్టు నో చెప్పగా.. ఈడీ విచారణకు డీకే హాజరయ్యారు. విచారణలో భాగంగా గడచిన ఐదు రోజుల పాటు డీకేకు ఈడీ అధికారులు చుక్కలు చూపించారట. ఈడీ సంధిస్తున్న ప్రశ్నల పరంపరతో ఒకానొక సమయంలో డీకే కన్నీటి పర్యంతమయ్యారట. రాజకీయాల్లో ధైర్యంగా ముందుకెళ్లే నేతగా పేరున్న డీకే... ఈడీ విచారణ సందర్భంగా ఏడ్చేశారన్న వార్తలు కన్నడిగులను కలవరానికి గురి చేసేవే. మొత్తంగా డీకేను తమదైన శైలిలో విచారించిన ఈడీ అధికారులు... ఆయనను ఏడ్పించేసి ఆ తర్వాతే అరెస్ట్ చేశారన్న మాట.
Tags:    

Similar News