ఏవోబీ బలహీనపడినట్లేనా ?

Update: 2021-10-15 09:06 GMT
మావోయిస్టుల అగ్రనేత ఆర్కే @ అక్కిరాజు హరగోపాల్ మరణంతో మావోయిస్టు ఉద్యమం బలహీనపడుతుందనే భావిస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎలాగున్నా ప్రత్యేకించి ఆంధ్ర-ఒడిస్సా బార్డర్స్ (ఏవోబీ)లో మావోయిస్టుల బలహీనపడటం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. నిజానికి మావోయిస్టుల గురించి ఇంతగా రాయాల్సిన అవసరం లేదు. అయితే మావోయిస్టు ఉద్యమంలో ఆర్కే ప్రస్ధానం చాలా కీలకమనే చెప్పాలి. ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ లో గురువారం ఆర్కే మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టుల నుండి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఈయన తలపై లక్షలాది రూపాయల రివార్డులను ప్రభుత్వాలు ప్రకటించాయంటేనే ఆర్కే ఎంతటి కీలకవ్యక్తో అర్ధమవుతోంది. కొంతకాలంగా షుగర్, కీళ్ళనొప్పులు, కిడ్నీ సమస్యలు, ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్నారు. వీటిన్నింటికీ తోడు కరోనా వైరస్ కూడా ఒకసారి ఎటాక్ అయినట్లు సమాచారం. ఎన్ని అనారోగ్యాలు మీదపడినా డాక్టర్ల దగ్గర వైద్యం చేయించుకోవటానికి మాత్రం ఆర్కే ఇష్టపడలేదట. డాక్టర్లనే తానుండే ప్రాంతాలకు పిలిపించుకోవటం, వైద్యం చేయించుకోవటానికే ప్రాధాన్యత ఇచ్చారట.
Read more!

అనారోగ్యాలకు సరైన సమయంలో సరైన వైద్యం అందని కారణంగానే అనారోగ్యం బాగా విషమించి చివరకు మరణానికి దారితీసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈయన మరణం మావోయిస్టులపై మూడురకాల దెబ్బ పడినట్లే అనుకోవాలి. ఎలాగంటే మొదటిది మావోయిస్టుల ఆత్మస్ధైర్యం దెబ్బతినటం, రెండోది రిక్రూట్మెంట్ తగ్గిపోవటం, మూడోది జనాల్లో నమ్మకం కోల్పోవటం. ప్రత్యర్ధులపై గెరిల్లా తరహా దాడులు చేయటంలో ఆర్కే అందెవేసిన చేయిగా పోలీసులు చెబుతున్నారు. నిజానికి చాలాకాలంగా మావోయిస్టుల రిక్రూట్మెంట్ తగ్గిపోతోంది.

ఎందుకంటే యువతలో మావోయిస్టు ఉద్యమంపై నమ్మకం తగ్గిపోతోంది. ఈ కారణంగానే మావోయిస్టులో చేరానికి యువత ముందుకు రావటంలేదు. మావోయిస్టుల్లో కొత్త చేరికలు లేకపోగా ఉన్నవాళ్ళు కూడా ఏదో రూపంలో పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఒకపుడు స్ధానిక జనాలే మావోయిస్టులకు బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్ధగా పనిచేసేవారు. అలాంటిది మావోయిస్టులపై నమ్మకం తగ్గిపోతున్న కారణంగా జనాలు కూడా దూరమైపోతున్నారు.

ఇపుడు మావోయిస్టులంటే ఏవోబీ ప్రాంతంలో మాత్రమే కాస్త బలంగా ఉన్నారు. వీళ్ళని ముందుండి నడిపిస్తున్నది ఆర్కేనే. అలాంటి అగ్రనేత మరణించటమంటే ఏవోబీ ప్రాంతంలోని మావోయిస్టులకు పెద్ద దెబ్బనే చెప్పాలి. ఆర్కే కాకపోతే మరొకళ్ళు మావోయిస్టులకు నాయకత్వం వహించచ్చు కానీ ఆర్కే స్ధాయి కమిటెడ్ నేత మాత్రం మావోయిస్టులకు దొరకరని కచ్చితంగా చెప్పవచ్చు. దాదాపు 38 ఏళ్ళ ఆర్కే అజ్ఞాత పోరాటం మరణంతో ఆగిపోయినట్లే.


Tags:    

Similar News